Saraswati Pushkaralu 2025 In Telangana: తెలంగాణలో సరస్వతీ పుష్కర శోభ మొదలయ్యింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో పుష్కర సంబురం ప్రారంభమైంది. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు వేదికయ్యింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఈ పుష్కరాల కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రోజూ సుమారు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.
మీరూ సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నారా?
గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమం కాళేశ్వరంలో ఆధ్యాత్మిక ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఈ పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు ఎలా వెళ్లాలి? ఎక్కవ బస చేయాలి? ఏ ప్రదేశాల చూడాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కాళేశ్వరం హైదరాబాద్ నుంచి దాదాపు 288 కి.మీ దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాళ్లు హైదరాబాద్ నుంచి NH163 మీదుగా వెళ్లవచ్చు. కారులో సుమారు 4 నుంచి 5 గంటల ప్రయాణం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మే 15 నుంచి 26 వరకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతుంది. https://tsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తిరుపతి ఇన్ఫో (+91 9110583839) లాంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సు ప్యాకేజీ తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి క్యాబ్ లను కూడా బుక్ చేసుకుని వెళ్లవచ్చు. రైల్లో వెళ్లాలి అనుకునే వాళ్లు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి బస్సులో వెళ్లే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ఏరియల్ వ్యూ కోసం ప్రభుత్వం హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేసింది. బుకింగ్‌ల కోసం https://saraswatipushkaralu.com చూడండి.
ఎక్కడ బస చేయాలి?
కాళేశ్వరంలో బడ్జెట్ లాడ్జీల నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ సిటీ వరకు వసతి సౌకర్యాలు ఉన్నాయి. కాళేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వసతి గృహం, హరిత హోటల్ ఉన్నాయి. NTPC, సింగరేణి కాలరీస్ నిర్వహించే 50 వేల నుంచి లక్ష మంది భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ హోటళ్లలో రోజుకు రూ. 2000 నుంచి 5000 ఖర్చు అవుతుంది. టెంట్ సిటీలో రూ, 500 నుంఇ 1500 వరకు తీసుకుంటారు. ఇక ట్రావెల్స్ టూర్ ప్యాకేజీలలో ఒక్కొక్కరికి రూ. 10,267 నుంచి రూ.15,000 వరకు వసూళు చేస్తున్నారు. ఈ టూర్ 3 నుంచి 5 రోజులు ఉంటుంది.
పవిత్ర స్నానం ఎప్పుడు చేయాలి?
ప్రశాంతంగా పుష్కర స్నానం చేయాలనుకునే భక్తులు తెల్లవారుజామున (ఉదయం 4–ఉదయం 6) లేదంటే సాయంత్రం త్రివేణి సంగమంలో స్నానం చేయండి. కాశీ పూజారులు నేతృత్వంలో మంత్రోచ్ఛారణలతో కూడిన సాయంత్రం హారతిలో పాల్గొనండి. ఘాట్‌లు, శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో దత్తాత్రేయ హోమం, రుద్ర హోమం, పితృ దోష పూజలు నిర్వహిస్తారు. పూజారులు ఒక్కో హోమానికి రూ. 500 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తారు. ఈ హోమం కోసం https://saraswatipushkaralu.comలో పూర్తి వివరాలు చూడండి. పీఠాధిపతుల ఆధ్యాత్మిక ప్రసంగాలు, తెలంగాణ వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించండి. 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని సందర్శించండి.
కాళేశ్వరం సమీపంలో దర్శించుకోవాల్సిన ఆలయాలు
⦿ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం: త్రివేణి సంగమం దగ్గర శివ-యమ మందిరం ఉంది. ఉదయం 4 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది.
⦿ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం: శ్రాద్ధ పూజలకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది.
⦿ శ్రీ శుభానంద అమ్మవారి ఆలయం: ఇందులో పార్వతీ దేవి కొలువుదీరారు.
⦿ గణపేశ్వరాలయం (కోట గుల్లు): 12వ శతాబ్దపు కాకతీయ శివాలయం. కాళేశ్వరానికి 50 కి.మీ దూరంలో ఉంది.
⦿ సరస్వతి ఆలయం, బాసర: కాళేశ్వరం నుంచి 200 కి.మీ దూరంలో ఉంటుంది. ఒక రోజు టూర్ కు అనుకూలంగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మేలో ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో సన్ స్క్రీన్, టోపీలు, హైడ్రేషన్ వాటర్ ను తీసుకెళ్లండి. ఉదయం, సాయంత్రం వేళలో పర్యటించడం మంచిది.
Read Also: పుష్కరాలకు ప్రత్యేక బస్సులు.. భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్!