Karnataka To Mahakumbh Bike Journey : ఓ తండ్రి-కొడుకుల జంట 3000 కిలోమీటర్ల బైక్ జర్నీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా యాత్ర కోసం కర్ణాటకకు చెందని ఓ 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని బైక్ పై తీసుకెళ్లాడు. త్రివేణి సంగమంలో ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ పుణ్యస్నానం చేసి.. తిరిగి బైక్ పైనే క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ప్రయాణం సమయంలో తండ్రీకొడుకులు రాత్రిపూట పెట్రోల్ బంకుల వద్ద టెంట్లు వేసుకుని బస చేశారట. తిరిగి ఉదయాన్నే బైక్‌పై ప్రయాణాన్ని కొనసాగించారట. ఈ ఆసక్తికర ప్రయాణం ఎలా సాగిందో వివరంగా తెలుసుకుందాం.
3,000 కిలోమీటర్ల ప్రయాణం:
ఉడుపి జిల్లాలోని శిర్వా గ్రామానికి చెందిన ప్రజ్వల్ షెనాయ్ (25) తన తండ్రి రాజేంద్ర షెనాయ్ (52)తో కలిసి బైక్‌పై ఫిబ్రవరి 6న ఉదయం 4 గంటలకు మహాకుంభమేళాకు బయలుదేరాడు. శిర్వా నుంచి బయలుదేరి యల్లాపూర్, హుబ్బళ్లి, విజయపుర, షోలాపుర్, లాతూర్, నాందేడ్, నాగ్‌పుర్, జబల్‌పుర్ మీదుగా తమ సాధారణ బైక్‌పై 3,000 కిలోమీటర్ల ప్రయాణించి ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ఫిబ్రవరి 10న త్రివేణి సంగమంలో తండ్రీకొడుకులు ఇద్దరూ పవిత్ర స్నానం చేసి, ఫిబ్రవరి 13న స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
Also Read: మహాశివరాత్రికి ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ.. శ్రీశైలం, హైదరాబాద్ పర్యటన
ట్రాఫిక్ జామ్, కానీ బైక్‌కు అనుమతి:
తాము ప్రయాగ్రాజ్ చేరుకునేసరికి దాదాపు 250-300 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ ఉందని ప్రజ్వల్ షెనాయ్ మీడియాకు తెలిపాడు. అయితే, బైక్‌ను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారని పేర్కొన్నాడు. “పుణ్యస్నానాలు చేసే ప్రదేశంలో రద్దీ లేదు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణం చేసేటప్పుడు దారిలో కొందరు మమ్మల్ని ఆపి మాట్లాడేవారు. మధ్యప్రదేశ్‌లోని సియోని సమీపంలో కారులో వెళ్తున్న ఒక వ్యక్తి మా బైక్‌ను ఆపి, తన ఖరీదైన కూలింగ్ గ్లాసెస్, కూల్ డ్రింక్స్, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. ఆ రాష్ట్ర పోలీసులు కూడా ప్రయాణంలో మాకు సహకరించారు” అని ప్రజ్వల్ చెప్పాడు.
రూ. 20,000 మాత్రమే ఖర్చు:
“144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు నా కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్లడం గర్వంగా ఉంది. ఈ ప్రయాణానికి మాకు కేవలం రూ. 20,000 మాత్రమే ఖర్చు అయ్యింది. మార్గమధ్యలో ఒక వ్యక్తి నా కుమారుడికి కొత్త హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చాడు,” అని రాజేంద్ర షెనాయ్ తెలిపారు.
తల్లి రజనీ మాటల్లో.. తన భర్త, కొడుకుకు బస్సులో ప్రయాణించడం అలవాటు లేదని ప్రజ్వల్ తల్లి రజనీ తెలిపారు. “మాకు కారు లేదు. నా భర్త, కొడుకు బైక్‌పై ప్రయాణాలు చేస్తారు. కొంత డబ్బును ఆదా చేసి ప్రయాగ్రాజ్ వెళ్లమని వారికి ఇచ్చాను. నా కొడుకు, భర్త కుంభమేళాకు వెళ్లినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి,” అని రజనీ పేర్కొన్నారు.
గతంలోనూ బైక్ యాత్ర:
గత ఏడాది జూన్‌లో ఈ తండ్రీకొడుకుల టీమ్ బైక్‌పై హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, లేహ్-లద్ధాఖ్, కార్గిల్, మనాలీ గుండా 10 రోజుల్లో 2,100 కిలోమీటర్ల ప్రయాణించింది. సముద్ర మట్టానికి 17,982 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరం.. ఖార్దుంగ్లాపై కన్నడ జెండాను వీరిద్దరూ ఎగురవేశారు.