Indian Railway Stations: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అద్భుతంగా పునర్నిర్మిస్తున్న రైల్వేశాఖ.. ఇకపై ప్యాసింజర్లకు మరింత ఆహ్లాదాన్ని పంచే నిర్ణయాలను చేపడుతోంది. జర్నీ చేసి అలసిపోయిన ప్రయాణీకులు రిలాక్స్ అయ్యేలా అత్యాధునిక ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకోసం కేరళను ఎంచుకుంది. కేరళ రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణీకులకు త్వరలో మసాజ్ చైర్లు, గేమింగ్ జోన్లు, స్లీపింగ్ పాడ్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే సంస్థ.. రాష్ట్ర వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే పలు స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటు
ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లలో అత్యాధునిక పరికరాల ఇన్ స్టాలేషన్ ప్రక్రియ మొదలయ్యింది. తొలి విడుతలో భాగంగా మసాజ్ కుర్చీలను కోజికోడ్, ఒట్టప్పలం, పాలక్కాడ్, పొల్లాచిలలో ఇన్ స్టాలేషన్ చేస్తున్నారు. కర్నాటకలోని మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఇప్పటికే మసాజ్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ చైర్లు వినియోగించుకునేందుకు ప్రయాణీకులు సమయం ఆధారంగా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కోజికోడ్ స్టేషన్ లో ప్రస్తుతం మూడు మసాజ్ చైర్లను ఇన్ స్టాలేషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. త్వరలో మరిన్ని రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
వెయిటింగ్ టైమ్ లో ఎంటర్ టైన్ మెంట్
ప్రయాణీకులు తమ రైళ్ల కోసం వేచి ఉన్నప్పుడు వినోదం కోసం చూస్తున్న వారికి పాలక్కాడ్ జంక్షన్, పరప్పనంగడి రైల్వే స్టేషన్లలో గేమింగ్ జోన్‌ల ను ఏర్పాటు చేయనున్నారు. ఈ జోన్‌లలో ప్రయాణీకులు ముఖ్యంగా పిల్లలను ఆహ్లాదపరిచేందుకు కంప్యూటర్ గేమ్ లను అందుబాటులో ఉంచనున్నారు. గేమింగ్ సౌకర్యాల ఏర్పాటు కోసం ఇప్పటికే టెండర్లు జారీ చేశారు. రెస్ట్, ఎంటర్ టైన్ మెంట్ ఎంపికలతో పాటు స్లీపింగ్ పాడ్‌లు అందనున్నాయి. ప్రయాణీకులకు క్యాప్సూల్ తరహా విశ్రాంతి స్థలాన్ని అందించనున్నారు. ఈ కాంపాక్ట్ స్థలాలలో బెడ్, ఛార్జింగ్ పాయింట్లు, లగేజ్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది. రాత్రిపూట వచ్చే, ఉదయం రైళ్ల కోసం వేచి ఉండే ప్రయాణీకులకు ఈ వసతులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!
నెమ్మదిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ
ప్రయాణీకుల సౌలభ్యాన్ని మరింత పెంచడానికి కోజికోడ్, షోరనూర్, పాలక్కాడ్ సహా ఎంపిక చేసిన స్టేషన్లలో హెల్త్ కియోస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కియోస్క్ లు ప్రయాణీకులకు అవసరమైన ఆరోగ్య సహాయాన్ని అందిస్తాయి. సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఇక ఇప్పటికే హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులు రెస్ట్ తీసుకునేందుకు స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేశారు. రెస్ట్ తీసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేరళ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: భారత్ నుంచి ఆ అందాల లోకానికి కొత్త రైల్వేలైన్, ఎన్ని లాభాలో తెలుసా?
Read Also: జనరల్ టికెట్ రూల్స్ మారుతున్నాయ్.. ఇకపై అలా చేస్తే కుదరదు!