Khairatabad Ganesh Utsavam 2025: దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి తయారీ పనులు ప్రారంభం అయ్యాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నాగు అట్టహాసంగా కర్ర పూజ నిర్వహించారు. 71వ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా భారీ గణనాథుడి రూపాన్ని ఉత్సవ సమితి సభ్యులు విడుదల చేశారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు వినాయకుడిని తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి మహా గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహ విశేషాలు!
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహ నిర్మాణానికి కర్రపూజ నిర్వహించిన నేపథ్యంలో ఈ ఏడాది వినాయకుడి రూపానికి సంబంధించిన చిత్రాన్ని ఆవిష్కరించారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో, గణపతి విగ్రహం ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలతో, కుడివైపు లక్ష్మి పార్వతి విగ్రహాం ఉంటుంది. ఈ రూపం విశ్వ శాంతి, శక్తి సమన్వయాన్ని సూచిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలో బాగా ఫేమస్!
ఖైరతాబాద్ మహా గణపతి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ వినాయకుడిని చూసేందుకు, స్వామి వారి ఆశీర్వాదం పొందేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి పెద్ద ఎత్తున భక్తులను ఆకర్షించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం విశేష పూజలు, అర్చనలు నిర్వహించబడతాయన్నారు. ఈ రూపంలో గణపతి విశ్వవ్యాప్త శాంతి, శక్తిని ప్రసాదించే దేవుడిగా ఆరాధించబడతారని వెల్లడించారు. ఈ విగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని, శాంతిని అందిస్తుందన్నారు.
Read Also: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బు వాపస్, వెంటనే ట్రై చేయండి!
కర్రపూజ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
తాజాగా జరిగిన మహా గణపతి కర్రపూజ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఉత్సవ కమిటీని అధికారిక ప్రకటను గమనించాలని సభ్యులు వెల్లడించారు.
Read Also: మారిన తత్కాల్ టికెట్ రూల్స్.. ఇకపై అది తప్పనిసరి, లేకుంటే?