Kuldhara Village Mystery: రాజస్థాన్ లోని జైసల్మేర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కుల్దారా’.. దేశంలోనే అత్యంత మిస్టరీ గ్రామాల్లో ఒకటిగా ఉంది. రెండు శతాబ్దాలకు పైగా ఎలాంటి జనసంచారం లేకుండా.. ‘దెయ్యాల గ్రామం”గా ప్రసిద్ధి చెందింది. చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు ఈ గ్రామం ఖాళీ కావడానికి సహజమైన కారణాలను చూపిస్తున్నప్పటికీ.. నేటికీ చాలామంది అక్కడేదో అదృశ్య శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కుల్ధారా చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథనాల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
13వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న కుల్ధారా గ్రామం.. వ్యవసాయంలో ఆరితేరిన పాలివాల్ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శతాబ్దాల పాటు వర్ధిల్లింది. అయితే 1825 ప్రాంతంలో ఈ గ్రామం అకస్మాత్తుగా ఖాళీ అయింది. కేవలం ఈ ఒక్క గ్రామమే కాకుండా దీని చుట్టుపక్కల ఉన్న దాదాపు 80కి పైగా పాలివాల్ గ్రామాల ప్రజలు ఒక్కరాత్రిలోనే ఇళ్లను వదిలి వెళ్లిపోయారని స్థానిక కథలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే కుల్దార్ గ్రామాన్ని ఖాళీ అవ్వడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం.. జైసల్మేర్ సంస్థానంలో దివాన్‌గా ఉన్న సలీమ్ సింగ్ అనే క్రూరుడైన అధికారి పన్నుల వేధింపులు, గ్రామాల్లోని ఓ అమ్మాయిపై అతను కన్ను పడటం వల్లే గ్రామాన్ని ఖాళీ చేసి పాలివర్ బ్రాహ్మణులు వెళ్లిపోయారని స్థానికులు అంటుంటారు. అయితే చరిత్రకారులు ప్రకారం.. విపరీతమైన పన్నుల భారంతో పాటు రాజకీయ అస్థిరత, ఎడారిలో తాగునీటి వనరులు అడుగంటిపోవడం, వర్తక మార్గాలు దెబ్బతినడం వల్లే వారు గ్రామాన్ని వదిలి వెళ్లారని సమాచారం. ఏది ఏమైనా ఒక్కరాత్రిలోనే ఒక సమాజం మొత్తం కనిపించకుండా పోయిందనే కథనం ఈ ప్రాంతానికి ఒక రకమైన మిస్టరీని తెచ్చిపెట్టింది.
అయితే కుల్ధారా అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది ఆ ఊరి ప్రజలు ఇచ్చినట్లు చెప్పే శాపం. తమను ఇల్లు వదిలిపోయేలా చేసిన ఈ నేలలో ఇకపై ఎవరూ నివసించలేరని, ఒకవేళ నివసిస్తే సర్వనాశనం అవుతారని పాలివాల్ బ్రాహ్మణులు శపించినట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఈనాటికీ ఆ గ్రామంలో ఎవరూ స్థిరపడలేకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే ఈ శాపం ఉందనడానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకపోవడం గమనార్హం. దీనికితోడు కుల్దారా చుట్టూ దెయ్యం కథలు ప్రచారంలోకి రావడం మరింత ఆసక్తిని పెంచింది.
Also Read: కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!
కుల్ధారాకు ఉన్న ‘హాంటెడ్’ ఇమేజ్‌ను టీవీ షోలు, ట్రావెల్ డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా కథనాలు మరింత పెంచేశాయి. పలువురు పారానార్మల్ పరిశోధకులు రాత్రి వేళల్లో ఇక్కడ పరిశోధనలు చేసి, వింత శబ్దాలు విన్నామని చెప్పినప్పటికీ, వాటికి సైంటిఫిక్ నిరూపణలు ఏవీ లేవు. భద్రతా కారణాల దృష్ట్యా రాజస్థాన్ ప్రభుత్వం సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. కేవలం పగటిపూట మాత్రమే సందర్శకులకు ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్రచారం వల్ల భారత్‌లోనే అత్యంత భయంకరమైన గ్రామంగా కుల్దారా ఈ స్థాయి పాపులర్ ఇమేజ్ దక్కించుకోవడం విశేషం.
Also Read: BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!