Indian Railways: ఉత్తరప్రదేశ్ లో జరిగే మహా కుంభమేళాకు భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏకంగా 13 వేలకు పైగా రైళ్లను ప్రయాగ్ రాజ్ కు షెడ్యూల్ చేయనుంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఇక మహా కుంభమేళాకు ఆంధ్ర ప్రదేశ్ ను పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
తిరుపతి నుంచి బెనారస్ కు ప్రత్యేక రైలు
మహా కుంభమేళా నేపథ్యంలో తిరుపతి నుంచి బెనారస్ కు 07107 నెంబర్ గల ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్ జనవరి 18తో పాటు ఫిబ్రవరి 8, 15, 23న తిరుపతి నుంచి వెళ్లనుంది. రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయల్దేరే ఈ రైలు మరుసటి రోజు అంటే సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ రైల్వే స్టేషన్ కు చేరుతుంది. అదే రైలు(07108) తిరుగు ప్రయాణంలో భాగంగా జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24న మంగళవారం బెనారస్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి-బెనారస్ రైలు ఏ స్టేషన్ లో ఆగుతుందంటే?
మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.
Read Also: ట్రైన్ చివరి కోచ్ మీద ‘X’ సింబల్.. ఇదీ అసలు కథ!
మహా కుంభమేళాకు నర్సాపూర్-బెనారస్ ప్రత్యేక రైలు
అటు మహా కుంభమేళా కోసం ఇప్పటికే నర్సాపూర్-బెనారస్ (07109) ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు జనవరి 26, ఫిబ్రవరి 2న నర్సాపూర్ నుంచి ప్రయాణం మొదలు పెడుతుంది. ఉదయం 6 గంటలకు నర్సాపూర్ రైల్వే స్టేషన్ లో బయల్దేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఇదే రైలు(07110) జనవరి 27, ఫిబ్రవరి 3న తిరుపతికి తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ రైలు బెనారస్ లో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తిరుపతికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లను మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇక యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జనవరి నుంచి మొదలయ్యే మహా కుంభమేళా వేడుకలు సుమారు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ వేడుకల కోసం యోగీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది.
Read Also: ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకోండి..