Malkajgiri Mini Railway Terminal Plan: హైదరాబాద్ రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మల్కాజ్ గిరి రైల్వే జంక్షన్ ను మినీ టెర్మినల్ గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, మల్కాజ్‌గిరి భవిష్యత్తులో హైదరాబాద్‌కు రెండో ముఖ్యమైన రైల్వే టెర్మినల్‌గా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైల్వే టెర్మినళ్లపై రైళ్ల రద్దీ, ప్రయాణికుల ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కాచిగూడ స్టేషన్‌పై ఉన్న ఆపరేషనల్ భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు మల్కాజ్‌గిరిని ఉపయోగించుకోవచ్చనే ఆలోచన ఉంది. ఇందుకోసం స్టేషన్‌లో అదనపు ట్రాక్‌లు, లూప్ లైన్లు, ప్లాట్‌ఫారాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మల్కాజ్‌గిరిని మినీ టెర్మినల్‌గా మార్చితే హైదరాబాద్ నుంచి బయలుదేరే, నగరంలోనే ప్రయాణం ముగించే కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైళ్ల రాకపోకలను వేర్వేరు స్టేషన్లకు విభజించవచ్చు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో రైల్వే నిర్వహణ సులభమయ్యే అవకాశం ఉంది.
మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులకు కూడా ఈ ప్రతిపాదన ఉపయోగకరంగా మారొచ్చు. ప్రస్తుతం దూరంలోని ప్రధాన స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉన్న కొందరు ప్రయాణికులకు మల్కాజ్‌గిరి నుంచే మరిన్ని రైలు సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గుతుంది. కర్నూలు, నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు నేరుగా, మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.
ఇక సబర్బన్ రైలు సేవల విషయంలోనూ ఈ అభివృద్ధి కీలకంగా మారే అవకాశం ఉంది. మల్కాజ్‌గిరి చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అదనపు ట్రాక్‌లు, ప్లాట్ ఫారాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మరిన్ని MMTS సేవలను వివిధ మార్గాల్లో నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది.
మల్కాజ్‌గిరిని రెండో టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఇప్పుడే మొదటిసారి రావడం కాదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత కొన్ని పరిపాలనా కారణాలతో దృష్టి చర్లపల్లి వైపు మళ్లింది. అక్కడ టెర్మినల్ అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అయినప్పటికీ మల్కాజ్‌గిరి ప్రయాణికుల డిమాండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అదనపు ప్లాట్‌ఫారాలు, మరిన్ని రైల్వే ట్రాక్‌లు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రయాణికుల సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తాజాగా రైల్వే అధికారులు మల్కాజ్‌గిరి స్టేషన్‌ను పరిశీలించడం, ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఈ ప్రతిపాదనకు మరోసారి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ప్రణాళిక కార్యరూపం దాల్చితే మల్కాజ్‌గిరి భవిష్యత్తులో హైదరాబాద్ రైల్వే నెట్ వర్క్ లో మరింత కీలకమైన స్టేషన్‌గా మారే అవకాశం ఉంది.
Read Also: 24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!