Indian Bullet Train: దేశంలోనే మొట్ట మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. గుజరాత్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా భరూచ్ సమీపంలో 100 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు రైల్వే అధికారులు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ లో అత్యంత ముఖ్యమైన ఈ వంతెనను స్వదేశీ ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈ రైల్వే వంతెన ప్రత్యేకత ఏంటంటే?
తాజాగా నిర్మించిన ఈ వంతెనను పూర్తి స్థాయిలో ఉక్కుతో తయారు చేశారు. సుమారు 1,432 మెట్రిక్ టన్నుల బరువు, 100 మీటర్ల పొడవు, 14.6 మీటర్ల ఎత్తు, 14.3 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. గుజరాత్ లోని భుజ్ లో దీనిని ఏర్పాటు చేశారు. ట్రెస్టల్ సపోర్ట్ సిస్టమ్‌లను ఉపయోగించి నేల నుంచి 14.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ముందుగా ఈ వంతెనకు సంబంధించిన విడి భాగాలను అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇన్ స్టాలేషన్ చేశారు. ఈ నిర్మాణం కోసం 60,000 కంటే ఎక్కువ టోర్-షీర్ టైప్ హై స్ట్రెంత్ బోల్ట్‌లను ఉపయోగించారు. C5-గ్రేడ్ యాంటీ-కొరోషన్ కోటింగ్‌తో పాటు ఎలాస్టోమెరిక్ బేరింగ్‌లను అమర్చారు. ఈ బ్రిడ్జి జీవితకాలం 100 సంవత్సరాలకు పైగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
అత్యాధునికి రైల్వే వైపు కీలక ముందడుగు
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ భారతీయ రైల్వేలో కీలక మైలు రాయిగా నిలువబోతోంది. హై స్పీడ్ రైల్వే మౌలిక సదుపాయాలలో కీలక ముందడుగు కాబోతోంది. ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ బుల్లెట్ రైలు కారిడార్ రెండు ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటలకు పైగా తగ్గించనుంది. ఈ కారిడార్‌లో గుజరాత్ లో విస్తృతమైన కవరేజీని అందిస్తుంది. సకాలంలో భూసేకరణ, స్థానిక మద్దతు, సమర్థవంతమైన ప్రాజెక్ట్ అమలు విధానాల కారణంగా పురోగతి చాలా వేగంగా కొనసాగుతోంది.
గుజరాత్ లో 17 రైల్వే బ్రిడ్జిల నిర్మాణం
హైస్పీడ్ రైల్వే కారిడార్ కు సంబంధించి గుజరాత్ అంతగా 17 రైల్వే వంతెనలను నిర్మిస్తున్నారు. వీటన్నింటినీ స్టీల్ తో రూపొందించారు. ఈ నిర్మాణాలు గంటలకు 320 కి.మీ/గం వేగంతో రైళ్లు ప్రయానించేందుకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తాయి. సివిల్ ఇంజనీరింగ్ పురోగతితో పాటు, కారిడార్ నిర్మాణ పద్ధతులు ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ (FSLM), స్పాన్ బై స్పాన్ (SBS) నిర్మాణం లాంటి అత్యాధునకి పద్దతులను అవలంభిస్తున్నారు. ఈ అధునాతన పద్ధతుల ద్వారా గుజరాత్ ప్రాంతంలో ఇప్పటికే 300 కిలోమీటర్లకు పైగా వయాడక్ట్‌లు పూర్తయ్యాయి.
Read Also: వందేభారత్ స్లీపర్ కు ఎదురు దెబ్బ, ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే!
2028 తర్వాత బుల్లెట్ రైలు పరుగులు
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ 2028 వరకు కొనసాగే అవకాశం ఉంది. 2028 చివరలో లేదంటే 2029 ప్రారంభంలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదిశగా రైల్వే అధికారులు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు.