Mumbai Train: రైల్వే ప్రయాణం చేయాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. కొంత మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. ఒకవేళ టీసీకి పట్టుబడితే జరిమానా కడుతారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తూ టికెట్ చెకర్ కు పట్టుబడ్డాడు. ఫైన్ కట్టాలంటూ అతడిని స్టేషన్ లోని టీసీ ఆఫీస్ లోకి తీసుకెళ్లారు. తననే ఫైన్ కట్టమంటారా? అంటూ సదరు వ్యక్తి రెచ్చిపోయాడు. ఆఫీస్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. రైల్వే సిబ్బంది పైనా దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ముంబైలోని సబర్బన్ రైలులో తాజాగా రైల్వే అధికారులు టికెట్స్ చెక్ చేశారు. బోరివాలి రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం సమయంలో ఈ చెకింగ్స్ కొనసాగాయి. అధికారులు నలుగురు ప్రయాణీకులను పట్టుకున్నారు. వారందరినీ దాదర్-విరార్ లోకల్ రైలు నుంచి దిగమని చెప్పారు. ముగ్గురు ప్రయాణికులకు సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఉన్నప్పటికీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఒక ప్రయాణీకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. వారందరినీ టికెట్ చెకర్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ప్రయాణీకులలో ఒకరు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆఫీస్ లోని కీబోర్డులు, మానిటర్లు, ఇతర కంప్యూటర్ పరికరాలను ధ్వంసం చేశాడు. రైల్వే సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. వారిపై గట్టిగా అరుస్తూ దాడికి దిగాడు. టికెట్ చెకర్లలో ఒకరి పైన కూడా దాడి చేశాడు. అతడి దాడిలో మరో ప్రయాణీకుడు కూడా గాయపడ్డాడు.
@RPF_INDIA @rpfwr1 @rpfwrbct Today 02/08/25 at Borivali station, a ticketless passenger beat up the TT and broke government computers and other valuables When government employees are not safe then how will the railways ensure the safety of the common man? @RailMinIndia @Gmwrly pic.twitter.com/2D9lxJNZ43
— Sujeet Mishra (@Sujeetmishra07) August 2, 2025
Read Also: పాకిస్తాన్ రైళ్లు ఇంత దారుణమా.. ఈ బోగీలను పాత సామాన్లవాడు కూడా కొనడేమో!
దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు
టికెట్ చెకర్ ఆఫీస్ లో దాడికి పాల్పడుతున్న వ్యక్తిని సిబ్బంది వీడియో తీయడం మొదలు పెట్టారు. వారిని కూడా అతడు తీవ్ర పదజాలంతో బెదిరించాడు. అదే సమయంలో ఆఫీస్ లో ఓ మహిళా ప్రయాణికురాలు అతడిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత గాయపడిన రైల్వే ఉద్యోగితో పాటు మరో ప్రయాణీకుడిని రైల్వే సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చట్టపరంగా అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడమే నేరం కాగా, రైల్వే సిబ్బందిపై దాడి చేయడంతో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం సీరియస్ అంశం అన్నారు. సదరు వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైల్వే ఉద్యోగులపై దాడులు చేసినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని రైల్వే పోలీసులు హెచ్చరించారు.
Read Also: వీడు ఎవడండి బాబు.. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు ఏకంగా కారుతో వచ్చేశాడు!