అసలే వర్షాకాలం. జర్రున జారే రోడ్లు. వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అంతే సంగతులు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కారును తప్పించబోయి ఓ బస్సు రోడ్డు దాటి ముందుకు దూసుకెళ్లింది. వర్షం కారణంగా బస్సు టైర్ రోడ్డు దిగగానే దిగబడింది. లేదంటే, పక్కనే ఉన్న గుంతలో పడిపోయి పెను ప్రమాదం జరిగేది. తృటిలో ముప్పు తప్పడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.
నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన TG 05 Z 0045 నెంబర్ గల బస్సు ఇవాళ ఉదయం సమయంలో నల్లగొండ నుంచి బయల్దేరింది. చండూరు మీదుగా చౌటుప్పల్ కు వెళ్లాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ శివారులోకి రాగానే ఓ కారు రోడ్డు పక్కన ఆపి ఉంది. బస్సు దగ్గరికి వచ్చే సమయంలోనే ఆ కారు సడెన్ గా రోడ్డు మీదికి వచ్చింది. దాన్ని తప్పించబోయి డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి బస్సును కుడివైపు కట్ చేశాడు. వర్షాకాలం కావడంతో భూమి పూర్తిగా తడిసిపోయి ఉంది. బస్సు రోడ్డు కిందికి దిగగానే కుడివైపు ఉన్న ముందు, వెనుక టైర్లు అమాంతం భూమిలోకి దిగబడ్డాయి. బస్సు ఇంజన్ భూమికి ఆనడంతో అలాగే ఆగిపోయింది. ఒకవేళ టైర్లు దిగబడకపోయి ఉంటే, పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లేది. బస్సు పల్టీలు కొట్టేది. పెను ప్రమాదం జరిగేది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణీకులు ఉన్నట్లు కండక్టర్ తెలిపారు.
Read Also: ట్యాంకర్ ను ఢీకొట్టి వంతెన పై నుంచి ఎగిరి పడ్డ బస్సు, ఐదుగురు స్పాడ్ డెడ్!
అటు ఈ ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ నిర్లక్ష్యమేనని బస్సు డ్రైవర్ తో పాటు, బస్సులోని ప్రయాణీకులు అంటున్నారు. అప్పటి వరకు రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు, అకస్మాత్తుగా రోడ్డు మీది రావడంతో బస్సును కుడివైపుకు కట్ చేయాల్సి వచ్చిందని డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. అతడి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఈ ఘటన జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులు స్పాట్ కు చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది.