Chityala Railway Station Incident: నారాయణాద్రి ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చిట్యాల రైల్వే స్టేషన్ లో కాసేపు అయోమయ పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుడి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు, స్థానికుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంబులెన్స్ కోసం గంట పాటు ఎదురు చూసినా రాకపోవడంతో ప్లాట్ ఫామ్ మీదే ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. ప్రయాణికుడు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నెల్లూరుకు చెందిన వెంకటేష్ (41) కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో ప్రయాణిస్తుండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలును చిట్యాల రైల్వే స్టేషన్‌లో ఆపారు.
రైలు చిట్యాల స్టేషన్‌కు చేరుకున్న తర్వాత వెంకటేష్‌ను ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనను అక్కడే వదిలి రైలు సిబ్బంది వెళ్లిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కలవరపడ్డారు. అత్యవసర వైద్యం అందాల్సిన సమయంలో రైల్వే స్టేషన్‌లోనే చికిత్స కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకటేష్ పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే సమాచారం ఇచ్చి చాలాసేపు గడిచినా అంబులెన్స్ రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుమారు గంట సమయం గడిచినా అత్యవసర వైద్య సహాయం అందకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రయాణికుడు ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో అంబులెన్స్ కోసం ఎదురుచూడాల్సి రావడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
వెంకటేష్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. ఆయనకు సీపీఆర్ చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైనే కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి ఆయనను బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అక్కడున్న వారిని కలచివేశాయి. ప్రతి నిమిషం కీలకంగా మారిన పరిస్థితిలో వైద్య సాయం కోసం ఎదురుచూస్తూ ఆందోళనకు గురయ్యారు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి ఆటోలో హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక ప్రయాణికుడు రైలులో అస్వస్థతకు గురైనప్పుడు అత్యవసర వైద్యం అందించే విషయంలో రైల్వే సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అస్వస్థతకు గురైన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంలో రైల్వే సిబ్బంది ఎందుకు పట్టని తనం ప్రదర్శించారు? 108 అంబులెన్స్ ఎందుకు ఆలస్యమైంది? రైల్వే సిబ్బంది తీసుకున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also: పైలట్ నుంచి మద్యం వాసన.. ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్!