Railway Seat Rules: రైలు ప్రయాణం అంటే ఇష్టపడని వారు ఉండరు. హాయిగా, తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అత్యుత్తమమైన మార్గంగా రైల్వే నిలుస్తోంది. అయితే కొన్నిసార్లు చివరి నిమిషంలో టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీ లేదా స్నేహితులు అందరికీ ఒకే బోగీలో లేదా పక్కపక్కనే సీట్లు దొరకవు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది పక్క ప్రయాణికులను అడిగి సీట్లు మార్చుకుంటూ ఉంటారు. అయితే టీటీఈ అనుమతి లేకుండా ఇలా చేయడం చట్టబద్దమేనా? సీట్లను మార్చుకునే హక్కు ప్రయాణికులకు ఉందా? లేదా? అసలు చట్టం ఏం చెబుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రైల్వే రూల్స్ ప్రకారం.. ఒక ప్రయాణికుడు తనకి కేటాయించిన సీటును వదిలేసి ఇంకొకరి సీటులో కూర్చోవడం చట్టరీత్యా నేరం. దీనివల్ల భారీగా జరిమానా పడటమే కాకుండా జైలుకు వెళ్లాల్సి కూడా రావచ్చు. అయితే ఇద్దరు ప్రయాణికులు పరస్పర అంగీకారంతో సీట్లు మార్చుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఇద్దరు ప్రయాణికుల అంగీకారంతో కంటే టీటీఈ అనుమతి తీసుకొని సీట్లు మార్చుకుంటే ఇంకా బెటరని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ప్రయాణిస్తున్న బోగిలో ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే నిబంధనల ప్రకారం టీటీఈ వాటిని కేటాయించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతే తప్ప టీటీఈకి తెలియకుండా వేరొకరి రిజర్వ్డ్ సీటులో కూర్చోవడం కానీ, నిద్రించడం గానీ చేస్తే.. చిక్కులను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఒక వ్యక్తి.. టీటీఈ, వేరొక ప్రయాణికుడి అనుమతి లేకుండా మరో సీటులో కూర్చుంటే రైల్వే నిబంధనల ప్రకారం రూ.250 వరకు జరిమానా విధిస్తారు.
బుక్ చేసుకున్న రిజర్వ్డ్ సీటును వేరొక ప్రయాణికుడికి అమ్మడం లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం నిబంధనలకు విరుద్ధం. రైలు టికెట్లను అమ్మే అధికారం కేవలం రైల్వే శాఖకు మాత్రమే ఉంటుంది. అనుమతి లేకుండా టికెట్లను విక్రయించడం లేదా బదిలీ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడితే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశముంది.
Also Read: అడవి పందితో.. 14 ఏళ్ల బాలుడి విరోచిత పోరాటం.. 90 నిమిషాలు హోరాహోరీ ఫైట్!
చాలామంది రైలు టికెట్ బుక్ చేసుకున్నా ఫైనల్ చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయానికి అవి వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతాయి. అయినప్పటికీ కొందరు ఆ వెయిటింగ్ టికెట్‌తోనే రైలు ఎక్కేస్తుంటారు. అయితే విండో టికెట్ కాకుండా.. ఆన్‌లైన్ వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణించడం చట్టప్రకారం నేరం. ఇలా ప్రయాణిస్తూ దొరికిపోతే టీటీఈ రూ.250 జరిమానాతో పాటు ప్రయాణానికి సంబంధించిన పూర్తి టికెట్ ఛార్జీని వసూలు చేస్తారు.
Also Read: ఆస్పత్రిలో విచిత్రం.. సైలెంట్‌గా వచ్చి.. రూ.4 లక్షలు ఎత్తుకెళ్లిన వీధి కుక్క!