నార్త్ కొరియా అంటేనే అమ్మో అనే భయం సృష్టించాడు ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చెప్పడం చాలా కష్టం. నార్త్ కొరియాలో వాస్తవ పరిస్థితులు ఏంటి? అనేది చాలా మందికి తెలియదు. ప్రజలు ఏం చేసినా కిమ్ ప్రభుత్వానికి క్షణాల్లో తెలిసిపోతుంది. ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేక పని చేసినా వారి పని అయిపోయినట్లే. అంతగా నిఘా ఉంటుంది. ఇంతకాలం దౌత్యపరంగా ఒంటరిగా ఉన్న ఆ దేశం ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహిస్తోంది. రీసెంట్ గా ఆ దేశ రాజధాని ప్యోంగ్యాంగ్ లో అంతర్జాతీయ మారథాన్ నిర్వహించారు. అక్టోబర్ లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనన నిర్వహించబోతున్నారు.
జర్నలిస్టులు, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్స్ కు నో ఎంట్రీ
అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు జర్నలిస్టులు, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లూయెన్సర్స్ కు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే 24 నుంచి నవంబర్ 1 వరకు నార్త్ కొరియాకు విదేశీ పర్యాటకుల బృందాన్ని తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెన్సీ యంగ్ పయనీర్ టూర్స్(YPT) వెల్లడించింది. కానీ, ఈ పర్యటన జర్నలిస్టులు, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్స్ కు అనుమతి లేదని కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కిమ్ ప్రభుత్వం వీరి విషయంలో కఠినమైన పరిశీలన, పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రోవాన్ బియర్డ్ వెల్లడించారు. YPT టూర్స్ సంస్థ చైనా రాజధాని బీజింగ్ నుంచి బయల్దేరి ఉత్తర కొరియాలో అతిపెద్ద అంతర్జాతీయ వ్యాపార ప్రదర్శన అయిన ప్యోంగ్యాంగ్ ఆటం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ కు తీసుకెళ్లనుంది.
వాణిజ్య ప్రదర్శనలో ఏం ఉంటాయంటే?
అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ముఖ్యంగా యంత్రాలు, ఐటీ, ఎనర్జీ, ఔషధాలు, వినియోగ వస్తువులు, గృహోపకరణాలను ప్రదర్శించే 450 కి పైగా ట్రేడ్ బూత్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్యోంగ్యాంగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన చేసింది. “ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థపై లోతైన అవగాహన కోసం ఈ VIP ప్రదర్శనను నిర్వహించబోతున్నాం” అని వెల్లడించింది. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్యోంగ్యాంగ్‌లోని ప్రధాన ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
చైనాతో బలమైన సంబంధాలు
చైనా చారిత్రాత్మకంగా ఉత్తర కొరియాకు అతిపెద్ద దౌత్య, ఆర్థిక, రాజకీయ మద్దతుదారుగా ఉంది. ఇప్పటికీ అదే స్నేహం కొనసాగుతోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ దేశానికి విదేశీ పర్యాటకులు, వ్యాపార సందర్శకులలో ఎక్కువ మంది చైనా ప్రజలే ఉన్నారు. కరోనా తర్వాత ప్యోంగ్యాంగ్ కు విదేశీ పర్యాటకులను ఆహ్వానించినా, అనుకున్న స్థాయిలో రాలేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి ఉత్తర కొరియా స్పష్టమైన మద్దతు ఇవ్వడం పట్ల బీజింగ్ కూడా కాస్త కోపంగానే ఉన్నది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో చైనా నుంచి మళ్లీ టూరిస్టులు నార్త్ కొరియాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: కారు అంత బరువున్న రాకాసి పాము.. ఇంకా పెరుగుతూనే ఉందట: