Indian Railways plan: కొండల మధ్య ఊపిరి పీల్చుకుంటున్న లోయలు, వర్షాలకే తెలియని మార్గాలు, వందల గ్రామాలు.. చుట్టూ కొండలు, ఎదురుగా సరిహద్దులు. ఇక్కడి జీవితం అడుగడుగునా ఓ ప్రయోగం లాంటిదే. హాస్పిటల్‌కి వెళ్లాలన్నా, మార్కెట్‌కి చేరాలన్నా గంటల ప్రయాణం.
వర్షాకాలంలో పరిస్థితి ఇంకా ఘోరం. కొందరికి దేశంలోనే ఉన్నా.. దేశానికి దగ్గరగా ఉండటం గగనమైపోయేది. కానీ ఇప్పుడు అక్కడి గాలి మారుతోంది. ఓ కొత్త శబ్దం, కొత్త ఆశల సందేశం తీసుకొస్తోంది. ఇప్పటిదాకా ఊహల్లోనైనా ఊరించే రైలు శబ్దం, ఇక నిజంగా వినిపించబోతోంది.
భారత ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.. 2030 నాటికి ఈశాన్యానికి చెందిన 7 రాష్ట్రాలను దేశ రైల్వే నెట్‌వర్క్‌తో కలిపేస్తామన్న సంకల్పం. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని పెద్ద నగరాలు, పరిశ్రమలు, విమానాశ్రయాలు ఇప్పటికే రైలు కనెక్టివిటీతో జోరుగా ఉన్నాయి. కానీ ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ కొంతవరకు రైల్వే మార్గాలకు దూరమే.
ఈ 7 రాష్ట్రాలు – అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర కాగా, భౌగోళికంగా సవాళ్లతో కూడినవి. కొండలు, అడవులు, లోయలు మధ్య నిర్మాణ పనులు చేయడం చాలా కష్టమని అందరికి తెలుసు. కానీ అందులోనే భారత రైల్వే విజయాన్ని వెతుక్కుంటోంది.
ప్రస్తుతం జిరిబామ్–ఇంఫాల్ రైల్వే లైన్ పనులు మణిపూర్‌లో వేగంగా జరుగుతున్నాయి. ఇందులో దేశంలోనే అతి పొడవైన రైలు టన్నెల్, ఎత్తైన పుల్లింగ్ బ్రిడ్జ్ నిర్మితమవుతున్నాయి. ఇదే విధంగా, నాగాలాండ్‌లో దిమాపూర్ – కోహిమా, మిజోరంలో భైరాబి – సరంగ్, మేఘాలయంలో డూడోయ్ – బాగ్మారా, త్రిపురలో అగర్తలా – సబ్రూమ్ వంటి ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి.
Also Read: Silver petrol pump: అమ్మో! దేవుడికి పెట్రోల్ బంక్.. అదీ 10 కిలోల వెండితో!
ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయాణికులకు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని గంటల్లో తగ్గించే అవకాశం వస్తుంది. అంతేకాదు, ఈ ప్రాంతాల్లో టూరిజం, విద్య, వ్యాపార రంగాల్లో విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా నగరాల చేరువ కలుగుతుంది. విద్యార్థులు, రోగులు, రైతులు – అందరికీ ఇది ఓ గోల్డెన్ ఛాన్స్‌లా మారనుంది.
రైల్వే శాఖ Mission 2030 – One India, One Rail Grid పేరిట తీసుకొచ్చిన ఈ ప్రణాళిక కేవలం రవాణా మెరుగుదల కోసం కాదు. ఇది దేశ సమగ్రాభివృద్ధికి బీజం. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. నిర్మాణంలో జాతీయ భద్రతా దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుతూ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనులు సాగుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో రైలు చేరితే సైనిక రవాణా వేగవంతం అవుతుంది. సరిహద్దులకు సమీపంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో రైల్వే ఆధారిత మౌలిక సదుపాయాలు దేశ రక్షణకూ కలిసొచ్చే అంశమే. పైగా, ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన వనరులు – అటవీ ఉత్పత్తులు, ఫలితాలు, హస్తకళలు దేశం మొత్తం వ్యాపించేందుకు మార్గం కూడా ఇది.
అంతేకాదు, స్థానిక రైతులకు మార్కెట్ కనెక్టివిటీ, ఉద్యోగావకాశాలు, చిన్న తరహా పరిశ్రమలకు రవాణా బలం ఇలా అన్ని రంగాల్లో మేలుచేసే మార్గం ఇది. ఇదొక అడుగు కాదు.. పట్టాల మీద భవిష్యత్తు పయనం.
ఇప్పటివరకు ఇక్కడికి ట్రైన్ ఎప్పుడురా భగవంతుడా అని ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్! ఇక కొండలకి అడ్డుగా, లోయలపై సాగే కొత్త రైలు మార్గాలు.. ఈశాన్యాన్ని భారతదేశ హృదయంతో కలిపే సుసంపన్న మార్గాలవుతాయి. కొండలు బద్దలు చేసుకుంటూ… ట్రైన్ రావటమే కాదు.. అభివృద్ధి పయనం మొదలైందని చెప్పవచ్చు.