Jammu And Kashmir Tourism: వేసవిలో పర్యాటకులతో కళకళలాడాల్సిన కాశ్మీర్ లో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. పహల్గామ్ లో టూరిస్టులపై ముష్కరులు తూటాల వర్షం కురిపించారు. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ మొదలు పెట్టింది. పీవోకేతో పాటు ఏకంగా పాకిస్తాన్ లోకి వెళ్లిమరీ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి సామాన్యులు, గురుద్వారాలను టార్గెట్ చేసింది. దాయాది దేశం దాడులను భారత రాడార్ వ్యవస్థ తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తలు ఇలాగే కొనసాగితే, జమ్ముకాశ్మీర్ లో టూరిజం మరింత ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
సమ్మర్ లో జమ్ముకాశ్మీర్ కు టూరిస్టుల తాకిడి
నిజానికి సమ్మర్ వచ్చిందంటే, దేశంలోని పలు ప్రాంతాల నుంచి టూరిస్టులు జమ్ముకాశ్మీర్ కు వెళ్లే వాళ్లు. వేసవి తాపానికి దూరంగా మంచు కొండల్లో ప్రకృతి ఎంజాయ్ చేసే వాళ్లు. కాశ్మీర్ హిమాలయాల్లో ట్రెక్కింగ్, స్కీయింగ్, ఇతర అడ్వెంచర్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గుల్మార్గ్, సోన్ మార్గ్ లాంటి ప్రదేశాలు స్కీయింగ్ కోసం బాగా పాపులర్. శీతాకాలంలో చాలా మంది పర్యాటకులు తరలివస్తారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకమైన సంస్కృతి, ఆచారాలను పెట్టింది పేరు. కాశ్మీరీ నృత్యాలు, సంగీతం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కాశ్మీర్ సహజ అందం, దాల్ సరస్సు, హిమాలయ పర్వత శ్రేణులు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. వేసవిలో కాశ్మీర్ గ్రీనరీ, సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. భారత్ నుంచే కాకుండా, విదేశీ పర్యాటకులనుతో కాశ్మీర్ కళకళలాడుతుంది. ఎప్పటి లాగే ఈసారి కూడా గత నెల నుంచి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ, పహల్గామ్ ఉగ్రదాడితో పర్యాటకులు లేక కాశ్మీర్ వెలలబోతోంది.
Read Also: మీ ఆప్తులు జమ్ము కశ్మీర్ లో చిక్కుకున్నారా? ఇవిగో స్పెషల్ ట్రైన్స్!
టూరిజంపై ప్రభావం ఎంత?
వాస్తవానికిజమ్ముకాశ్మీర్ కు వెళ్లేందుకు పర్యాటకులు విమానాలు, రైళ్లతో పాటు రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటారు. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారతీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా కాశ్మీర్ కు వచ్చేందుకు మొగ్గు చూపరు. ఫలితంగా విమానయాన సంస్థలు, రైళ్లు, ఇతర రవాణా వ్యవస్థకు గిరాకీ తగ్గిపోతుంది. అటు కాశ్మీర్ లోని హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, రెస్టారెంట్లకు డిమాండ్ ఉండదు. విదేశీ మారకద్రవ్యాన్ని పొందే అవకాశం తగ్గుతుంది. స్థానికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాశ్మీర్ పర్యాటకరంగం కుదేలు కావడంతో పాటు స్థానికులు ఉపాధిలేక అవస్థలు పడే అవకాశం ఉంటుంది. అయితే, భారత్ దాయాది దేశానికి ఈ దెబ్బతో గట్టి సమాధానం చెప్తే, పీవోకేలో ఉగ్రజాడలు లేకుండా చేయడం, వీలుంటే పీఓకేని స్వాధీనం చేసుకుంటే, భవిష్యత్ లో ఉగ్రభయం లేని కాశ్మీర్ పర్యాటక రంగాన్ని చూసే అవకాశం ఉంటుంది.
Read Also: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. ఆ రైల్వే లైన్ ప్రారంభం ఇప్పట్లో కష్టమే!