Islamabad To Istanbul Via Tehran Rail Line: ఆసియా భౌగోళిక, రాజకీయాలను తీవ్ర ప్రభావం చేసే కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి పాకిస్తాన్- ఇరాన్ దేశాలు. రెండు దేశాలు వ్యూహాత్మక రైల్వే లైన్ ను ప్రకటించాయి. ఈ నిర్ణయం భారత ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించేలా ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అనేక సవాళ్లతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఇస్లామాబాద్- ఇస్తాంబుల్ వయా టెహ్రాన్ రైల్వే ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడ్డాయి పాకిస్తాన్- ఇరాన్. 6,543 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే భారత్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రయాణ సమయం 10 రోజులకు తగ్గింపు
ఇస్లామాబాద్- ఇస్తాంబుల్ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే పాకిస్తాన్- టర్కీ మధ్య ప్రయాణ సమయం 10 రోజులకు తగ్గనుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య విమాన మార్గంతో పాటు సముద్ర మార్గం ద్వారా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సముద్ర మార్గం ద్వారా 21 రోజుల సమయం పడుతుంది. 2009లో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు, ఆయా దేశాల్లోని ప్రాంతీయ సమస్యల కారణంగా నిలిచిపోయింది.
ఈ రైల్వే మార్గంతో భారత్ కు ఇబ్బందులు తప్పవా?
చైనా, పాకిస్తాన్- ఇరాన్ దేశాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా చాబహార్, గ్వాదర్ పోర్టుల చుట్టూ భారత్ కు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తోంది. చైనా సపోర్టుతో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు భారత పరిధికి దగ్గరగా విస్తరిస్తున్నాయి. గ్వాదర్, చాబహార్ మధ్య సముద్ర వాణిజ్యాన్ని పెంచడానికి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్- ఇస్తాంబుల్ వయా టెహ్రాన్ రైలు మార్గం మన దేశ ప్రాంతీయ ప్రయోజనాలకు సవాలుగా మారే అవకాశం ఉంది.
పాకిస్తాన్, ఇరాన్ సంబంధాలు బలోపేతం!
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు పాకిస్తాన్- ఇరాన్ దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని USD 8 బిలియన్లకు చేర్చాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం ఆర్థిక సహకారం, ప్రాంతీయ కనెక్టివిటీ అభివృద్ధికి ముందడుగు కానుంది.
Read Also: బుల్లెట్ రైలు వచ్చేస్తోంది, అదిరిపోయే విషయం చెప్పిన వైష్ణవ్!
పాక్- ఇరాన్ వాణిజ్య మంత్రుల కీలక సమావేశం
పాకిస్తాన్ ఫెడరల్ వాణిజ్య మంత్రి జామ్ కమల్ ఖాన్, ఇరాన్ పరిశ్రమ, గనులు, వాణిజ్య మంత్రి మొహమ్మద్ అటాబాక్ తాజాగా ఇస్లామాబాద్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రెండు దేశాలు తమ ఆర్థిక సంబంధాన్ని పునరుద్ధరించడానికి, సహకారాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై రెండు దేశాలు పలు విషయాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. రక్షణ, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని భావిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య చర్యలు, ఒప్పందాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.
Read Also: వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ముందు పరుగులు తీసేది ఈ రూట్ లోనే!