Pakistan Passenger Train Accident: పాకిస్తాన్ లో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్ లోని లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. పలు బోగీలు ట్రాక్ మీది నుంచి ఎగిరి దూరంగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణీకుడు స్పాట్ లోనే చనిపోయాడు. 25 మందికి పైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెషావర్ నుంచి కరాచీకి వెళ్తుండగా ప్రమాదం
ఇవాళ (ఆదివారం) ఉదయం సమయంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. పెషావర్ నుంచి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్ ప్రెస్ రైలు, పెషావర్ కు సుమారు 400 కి.మీ దూరంలో ప్రమాదాని గురయ్యింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు చెల్లా చెదురుగా పడి పోయాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయ బృందాలను ఘటనా స్థలానికి చేర్చారు. బాధితులను హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరీస్థితిని సమీక్షించారు లోధ్రాన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లుబ్నా నజీర్. అయితే, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. “ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి” అన్నారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కొద్ది గంటల్లోనే ఆ లైన్ లో రైలు సేవలు తిరిగి సాధారణ కార్యకలాపాలను ప్రారంభిస్తాయన్నారు.
కొనసాగుతున్న ట్రాక్ పునరుద్దరణ పనులు
అటు ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్ మీద పడి ఉన్న బోగీలను తొలగిస్తున్నారు. బోగీల తొలగింపు తర్వాత దెబ్బతిన్న ట్రాక్ ను సరిచేయనున్నారు. ఆ తర్వాత ఆ మార్గంలో రైల్వే సేవలు యథావిధిగా కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Read Also: దీపావళికి టికెట్ బుక్ చేసుకున్నారా? ఇప్పుడే త్వరపడండి రాయితీ దొరుకుతుంది!
పాకిస్తాన్ లో వరుస రైలు ప్రమాదాలు
గత సోమవారం పంజాబ్ ప్రావిన్స్ లోనే ఓ రైలు ప్రమాదం జరిగింది. రైవిండ్ పట్టణంలో ముసా పాక్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఈ నెల ప్రారంభంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్ ప్రెస్ లోని 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తాజాగా మరోసారి రైలు ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఫ్రీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చా? ఇదీ అసలు విషయం!