Mangaluru Water Metro: దేశంలోనే తొలిసారి కేరళలో వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. కొచ్చిలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు ఈ మెట్రో కర్ణాటకలోనూ ప్రారంభం కాబోతోంది. మంగళూరులో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటక ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాటర్ మెట్రో అందుబాటులోకి వస్తే మంగళూరు టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫాల్గుణి- నేత్రావతి నదులను కలుపుతూ వాటర్ మెట్రో
దక్షిణ కన్నడ జిల్లా జీవనాధారమైన ఫాల్గుణి, నేత్రావతి నదులను కలుపుతూ వాటర్ మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది. కర్నాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఓడరేవులు, లోతట్టు జల రవాణా శాఖ ఈ ప్రాజెక్టు DPR కోసం టెండర్లను పిలవడానికి సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ వాటర్ మెట్రో సర్వీసులు రెండేళ్లలోపు పనిచేయడం ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. టెండర్లు ఖరారు అయిన తర్వాత ప్రైవేట్ కంపెనీలను ఈ మెట్రో సేవలను నిర్వహించడానికి ఆహ్వానించడంపై కూడా చర్చలు జరగనున్నాయి. మంగళూరుతో పాటు చుట్టుపక్కల రోడ్లపై రద్దీ విపరీతంగా పెరుగుతోంది. వాటర్ మెట్రో రద్దీ నివారణకు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
పర్యాటక రంగానికి మరింత బూస్టింగ్
మంగళూరు వాటర్ మెట్రో నగరం అంతటా సెమిసర్క్యులర్ మార్గంలో నడుస్తుంది. ఇది మరవూర్ బ్రిడ్జి దగ్గర నుంచి ప్రారంభమై కోటేకర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ మెట్రోతో మంగళూరును సందర్శించే పర్యాటకులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. వాటర్ మెట్రో కటీల్, కుద్రోలి, తన్నీర్భావి బీచ్, సుల్తాన్ బ్యాటరీ, పణంబూర్ బీచ్, ఉల్లాల్ దర్గా, ట్రీ పార్క్, కద్రి పార్క్, మ్యూజియం, అలోసియస్ చాపెల్, కద్రి ఆలయం, మంగళాదేవి ఆలయం, రైల్వే స్టేషన్ లాంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.
మొత్తం 19 వాటర్ మెట్రో స్టేషన్ల నిర్మాణం
ఫల్గుణి, నేత్రావతి నదుల వెంబడి మొత్తం 19 వాటర్ మెట్రో స్టేషన్లు నిర్మించాలని అధికారులు అంచనాకు వచ్చారు. మరవూర్ వంతెన, జోకట్టే, కావూర్, కులూర్ వంతెన, బంగ్రాకులూర్, నాయర్ కుద్రు, సుల్తాన్ బ్యాటరీ, తన్నీర్భావి చర్చి, కసబా బెంగ్రే, ఓల్డ్ పోర్ట్, పోర్ట్ ఫెర్రీ, సాండ్ బార్ ఐలాండ్, తోట బెంగ్రే, హోయిగే బజార్, జెప్పు, ఓల్డ్ ఫెర్రీ, జెప్పు నేషనల్ హైవే బ్రిడ్జి, ఉల్లాల్ బ్రిడ్జి, కోటేకర్ లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
వాటర్ మెట్రోపై ఆందోళన
ఇక చాలా మంది ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టును స్వాగతించినప్పటికీ, మరికొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళూరులో ప్రతిపాదిత మార్గం అలైవ్ బాగిలు సమీపంలో నది ముఖద్వారం దగ్గర వెళుతుంది. ఇక్కడ అలల హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది వాటర్ మెట్రో సర్వీసులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ముందు సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం అవసరం అంటున్నారు.
Read Also: ఇక నుంచి నో టోల్ ఛార్జెస్, NKAI గుడ్ న్యూస్!