Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ఎన్నారైల కోసం ‘ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్’ ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. భువనేశ్వర్ లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నారై టారిస్టుల కోసం ఈ రైలును ప్రారంభించారు.
ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్
ప్రవాస భారతీయ ఎక్స్ ప్రెస్ రైలు న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అయ్యింది. మూడు వారాల పాటు ఈ రైలు ప్రయాణం కొనసాగనుంది. దేశంలోని పలు పర్యాటక, పుణ్యక్షేత్రాల మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. దీనిని ప్రత్యేక టూరిస్టు రైలుగా రూపొందించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ఈ టూరిస్టు రైలును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎన్నారైలు ఈ రైలులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రవాస భారతీయుల చారిత్రక మూలాలను గుర్తు చేసేలా ఈ రైలు ప్రయాణం కొనసాగనుంది.
ఈ రైలు ఎక్కడ ప్రారంభమై.. ఎక్కడి వరకు కొనసాగుతుందంటే?
ఢిల్లీ నుంచి బయల్దేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పాట్నా, గయా, వారణాసి, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, ఎక్తా నగర్, అజ్మీర్, పుష్కర్, ఆగ్రా వరకు వెళ్తుంది. ఆయా పుణ్యక్షేత్రాలను ఎన్నారైలు దర్శించుకోనున్నారు. చివరగా ఈ రైలు మళ్లీ ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైల్లో మొత్తం 156 మంది ఎన్నారైలు ప్రయాణించే అవకాశం కల్పించారు. ఇందులో ప్రయాణించే వారికి 4 స్టార్ హోటల్ వసతి కల్పించనున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన రైలు ప్రారంభానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేశారు.
Dekho Apna Desh 🇮🇳
🚆PM @narendramodi Ji flagged off the inaugural journey of the Pravasi Bharatiya Express, a special Tourist Train for the Indian diaspora.
📍18th Pravasi Bharatiya Divas convention, Bhubaneswar@DrSJaishankar pic.twitter.com/boADWKApoq— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 9, 2025
తక్కువ ఆదాయం ఉన్న ఎన్నారైలకు అవకాశం
ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ రైలును భారతీయ విదేశాంగ శాఖ, భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. పలు దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీల నుంచి ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించేందుకు ఎన్నారైలు దరఖాస్తు చేశారు. తక్కువ ఆదాయం ఉన్న ప్రవాస భారతీయులకు ఈ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: భారీ సంఖ్యలో వందేభారత్ రైళ్ల తయారీ.. మొత్తం ఎన్ని రైళ్లు రానున్నాయంటే?
పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వానిదే!
విదేశాంగశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఎన్నారైలకు సంబంధించి తిరుగు ప్రయాణంలో విమాన ఖర్చులను 90 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రవాస భారతీయులు కేవలం 10 శాతం ఖర్చులను భరించాల్సి ఉంటుంది. మరోవైపు భువనేశ్వర్ వేదికగా కొనసాగుతున్న భారతీయ ప్రవాసీ దివస్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశ అభవృద్ధికి ఎన్నారైల సహకారం అవసరం అన్నారు.
Read Also: షూటింగ్స్‌తోనూ ‘వందేభారత్’ రైళ్ల సంపాదన.. అప్పుడే ఎంత పారితోషికం వచ్చిందో తెలుసా?