Puri Ratha Yatra 2025| ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి జగన్నాథ ఆలయం.. హిందువులకు పవిత్రమైన ‘చార్ ధామ్’ క్షేత్రాలలో ఒకటి. ఆ శ్రీ మహా విష్ణవు ఇక్కడ జగన్నాథుడి రూపంలో తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథయాత్ర భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరం ఈ రథయాత్రలో లక్షలాది మంది పాల్గొంటారు.
2025 రథయాత్ర
ఈ సంవత్సరం రథయాత్ర జూన్ 26, 2025 మధ్యాహ్నం 1:24 గంటల నుండి జూన్ 27, 2025 ఉదయం 11:19 గంటల వరకు జరుగుతుంది. ప్రధాన కార్యక్రమం జూన్ 27న ఉంటుంది. ఈ రథయాత్ర సాంప్రదాయం.. భక్తి, కళల అద్భుత సమ్మేళనం. ఈ రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ (జులై 7) నుండి 12 రోజుల పాటు జరుగుతుంది. ఆలయ అధికారులు రెండు నెలల ముందు నుండే ఏర్పాట్లు చేస్తారు. ఈ ఉత్సవం భక్తులకు ఆనందం, భక్తిని అందిస్తుంది.
80 శాతం ఏర్పాట్లు పూర్తి
పూరిలో జగన్నాథుడి రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జూన్ 27న జరిగే ఈ పండుగ సజావుగా సాగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. న్యాయ, ఎక్సైజ్ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మాట్లాడుతూ.. 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలినవి జూన్ 27లోపు పూర్తవుతాయని చెప్పారు.
శ్రీ జగన్నాథ ఆలయ అధికారులు జూన్ 11న జరిగే స్నాన పూర్ణిమ కోసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్నాన మండపంలో భక్తుల దర్శనం కోసం మెరుగైన ఏర్పాట్లు చేశారు. సేవకుల సహకారంతో అన్నీ సజావుగా జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అధికారి అరబింద పధీ తెలిపారు. దైత సేవకులు సోమవారం ఆలయంలోకి ప్రవేశిస్తారు, మంగళవారం సేనాపటలగి ఆచారం జరుగుతుంది.
భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం.. 365 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఆరోగ్య సేవల కోసం 300 మంది అదనపు వైద్యులను నియమిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్ చెప్పారు. కోవిడ్ లక్షణాలున్నవారు.. పూరి రావొద్దని సూచించారు. ఈ రథయాత్ర జూన్ 27న మొదలై, స్నాన పూర్ణిమ తర్వాత దేవతలు 14 రోజుల పాటు అనసరలో విశ్రాంతి తీసుకుంటారు.
స్వామి ఊరేగింపు
ఇతర ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపులకు తీసుకొస్తారు, కానీ పూరిలో జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి మూల విగ్రహాలే రథయాత్రలో బయటకు వస్తాయి. ఇది ఈ యాత్రను అపురూపంగా చేస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారవుతాయి. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణం ప్రారంభమవుతుంది. చెట్లను 2188 ముక్కలుగా చేసి, జగన్నాథుడి రథం (నందిఘోష), బలభద్రుడి రథం (తాళధ్వజం), సుభద్రాదేవి రథం (పద్మధ్వజం) తయారు చేస్తారు. అక్షయ తృతీయ నాడు శిల్పులు పని మొదలుపెడతారు.
యాత్ర ప్రారంభ ప్రక్రియ
రథాలకు 250 అడుగుల తాళ్లు కడతారు. శుభ ముహూర్తంలో పూజారులు విగ్రహాలను గర్భగుడి నుండి బయటకు తీసుకొస్తారు. మొదట బలభద్రుడు, తర్వాత సుభద్రాదేవి, చివరగా జగన్నాథుడి విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను ‘పహాండీ’ అంటారు.
బంగారు చీపురు చెరా పహారా
పూరి రాజు జగన్నాథుడి రథాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీన్ని ‘చెరా పహారా’ అంటారు. గంధం నీళ్లు చల్లి, రథాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. భక్తులు తాళ్లు పట్టుకుని రథాలను లాగుతారు.
సాంప్రదాయ పద్ధతిలో రథాల తయారీ
రథాలను ‘విశ్వకర్మ’ లేదా ‘మహారాణా’ కుటుంబాల సాంప్రదాయ కళాకారులు నిర్మిస్తారు. వీరి నైపుణ్యం తరతరాలుగా వస్తోంది. రథాల డిజైన్, నిర్మాణాన్ని ప్రధాన మహారాణా పర్యవేక్షిస్తారు. కేవలం చక్రాలు, స్తంభాలు మాత్రమే వడ్రంగులు తయారు చేస్తారు. కమ్మరులు ఇనుప బిగింపులు, ఉంగరాలు సిద్ధం చేస్తారు. చిత్రకారులు పట్టచిత్ర శైలిలో రథాలను అలంకరిస్తారు. ఆధునిక యంత్రాలు లేకుండా, సాంప్రదాయ పద్ధతులతో రథాలు నిర్మిస్తారు.
Also Read: విహార యాత్రకు వెళ్లిన ఫ్యామిలీకి ప్రమాదం.. ఆంబులెన్స్‌కు రూ.70 లక్షలు ఖర్చు.. ఎలా జరిగిందంటే?
రథాల తయారీకి ఇవి ఉపయోగిస్తారు
రథాలకు వేప చెట్ల కలపను ఉపయోగిస్తారు. ఒడిశా ప్రభుత్వం అడవుల నుండి 1100 పెద్ద, 865 చిన్న దుంగలను అందిస్తుంది. ఇనుప మేకుల బదులు చెక్క మేకులు, ‘సలబంధ’ పద్ధతులతో రథాలను అసెంబుల్ చేస్తారు. యాత్ర తర్వాత రథాలను విడదీసి, భాగాలను వేలం వేస్తారు. మిగిలినవి ఆలయ వంటగదిలో ఇంధనంగా ఉపయోగిస్తారు.