Indian Railway: దశాబ్ద కాలంగా భారతీయ రైల్వే ఊహించని రీతిలో ప్రగతి కనబరుస్తోంది. దేశ వ్యాప్తంగా విద్యుదీకరణ సాధించే దిశగా కీలక ముందడుగు వేస్తోంది. అత్యాధునిక వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బుల్లెట్ రైళ్లను, హైడ్రోజన్ రైళ్లను పరిచయం చేసే దిశగా కీలక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సొంతంగా విద్యుత్ తయారు చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా రైల్వే పట్టాల మీద సోలార్ ఫలకాలను ఏర్పాటు చేయబోతోంది. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటును రైల్వే తన అవసరాలకు వినియోగించుకోబోతోంది.
వారణాసిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
ఇప్పటికే ఈ పైలెట్ ప్రాజెక్టును వారణాసిలో అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసిలోని యాక్టివ్ రైల్వే ట్రాక్ మధ్య సుమారు 70 మీటర్ల పొడవులో ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ BLW వర్క్ షాప్ లోని లైన్ నంబర్ 19లో ప్రారంభించింది. ఇందులో మొత్తం 15 kWp సామర్థ్యంతో 70 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 28 బైఫేషియల్ మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రోజుకు కి.మీ.కు 880 యూనిట్ల సోలార్ విద్యుత్ తయారు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, దేశ వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
ట్రాక్ ల మధ్య సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ఎలా?
ఇక సోలార్ పవర్ ప్యానెళ్లను రెండు రైలు పట్టాల మధ్య ఏర్పాటు చేస్తాయి. ఈ ప్యానెల్స్ ను రబ్బర్ మౌంటు ప్యాడ్లు, ఎపాక్సీ అంటుకునే పదార్థాలతో ఫిక్స్ చేస్తారు. రైళ్లు ఎంత వేగంగా ప్రయాణించినా, ఏమాత్రం చెక్కు చెదరకుండా రబ్బర్ ప్యాడ్లు నిరోధిస్తాయి. ఒకవేళ ట్రాక్ మరమ్మతులు చేయాలనుకుంటే ఈజీగా వాటిని తొలగించేలా ఉంటాయి. వాన, దుమ్ము, దూళిని తట్టుకుని పని చేస్తాయి. వీటి ఏర్పాటు ద్వారా రైల్వే ఆపరేషన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగదు.
దేశ వ్యాప్తంగా అమలుకు ప్రణాళికలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1.2 లక్షల కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ లు విస్తరించి ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే, అన్ని రైల్వే జోన్లలో ఈ సోలార్ విద్యుత్ తయారీ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అదనపు భూమి అవసరం లేని యార్డ్ లైన్లలో వీటిని విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా కిలోమీటరుకు సంవత్సరానికి 3.21 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. భారతీయ రైల్వే ట్రాక్ లు రోజుకు 25.71 మిలియన్ కిలోవాట్ల విద్యుత్తును (25,710 మెగావాట్లు) ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
భారీగా ఖర్చు తగ్గింపు
ఇక ఇండియన్ రైల్వేకు జీతాలు, పెన్షన్ తర్వాత, ఇంధనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇండియన్ రైల్వే ఆదాయంలో మూడవ వంతు వీటికే ఖర్చు అవుతుంది. సొంతంగా విద్యుత్ తయారు చేసుకుంటే భారతీయ రైల్వే గణనీయంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రైల్వే ట్రాక్స్ మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ తయారు చేసే విధానం చైనా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో కొనసాగుతుంది. త్వరలో ఈ లిస్టులో భారత్ కూడా చేరనుంది.
Read Also: 7 రూట్లలో రెట్టింపు కాబోతున్న వందేభారత్ కోచ్ లు, ఇదీ క్రేజీ న్యూస్ అంటే!