Indian Railways: అత్యాధునిక సదుపాయాల, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్న నేపథ్యంలో వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 144 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొన్ని రూట్లలో వందేభారత్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొని ఉంది. ఆయా రైళ్లలో వెళ్లాలని ప్రయాణీకులకు ఉన్పప్పటికీ కోచ్ లు సరిపడ లేకపోవడంతో వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో వందేభారత్ రైళ్ల కోచ్ ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే 7 రూట్లలో ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్లకు 20 కోచ్ లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రూట్లలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 102.01 శాతం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో (జూన్ 2025 వరకు) 105.03 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు అధికారులు గురించారు.
అదనపు కోచ్ లు ఏర్పాటు చేసే 7 మార్గాలు
అదనపు కోచ్ లు ప్రవేశపెట్టి 7 మార్గాలను అధికారులు ఇప్పటికే ఫైనల్ చేశారు. వాటిలో మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం సెంట్రల్, సికింద్రాబాద్-తిరుపతి, చెన్నై ఎగ్మోర్-తిరునెల్వేలి, మధురై-బెంగళూరు కాంట్, డియోఘర్-వారణాసి, హౌరా-రూర్కెలా, ఇండోర్-నాగ్ పూర్ రూట్లు ఉన్నాయి. కోచ్ ల పెంపు గురించి రైల్వే బోర్డు సమాచార, ప్రచార కార్యనిర్వాహక డైరెక్టర్ దిలీప్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. 16 బోగీలతో నడిచే రైళ్లను 20 బోగీలకు అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. 8 బోగీలు ఉన్న వాటిని 16 బోగీలకు పెంచుతామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆక్యుపెన్సీ, విస్తరణకు సాధ్యాసాధ్యాల ఆధారంగా, మూడు రైళ్లను 16 బోగీల నుంచి 20 బోగీలకు, నాలుగు రైళ్లకు 8 నుంచి 16 కోచ్ లకు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
16 నుంచి 20 కోచ్ లకు పెరిగే రైళ్లు
అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా మూడు వందే భారత్ రూట్లు అయిన మంగళూరు సెంట్రల్ – తిరువనంతపురం సెంట్రల్, సికింద్రాబాద్ – తిరుపతి, మరియు చెన్నై ఎగ్మోర్ – తిరునెల్వేలిలో రాకపోకలు కొనసాగిస్తున్న రైళ్లకు 16 కోచ్‌ల నుంచి 20కి పెంచనున్నారు. అదే సమయంలో, ప్రస్తుతం మిగిలిన నాలుగు రూట్లలో 8-కోచ్ లతో నడున్న రైళ్లకు 16 కోచ్ ల ను యాడ్ చేయనున్నారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?
10 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
అటు ప్రస్తుతం, 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు ఉత్పత్తిలో ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సుమారు 50 స్లీపర్ రేక్‌లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఉంది. అదనంగా, మరో 200 స్లీపర్ రేక్‌ల తయారీకి కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయి. అటు రాజస్థాన్‌లోని బికనీర్ లో తొలి వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రానుంది. బికనీర్ ను ఢిల్లీతో అనుసంధానించే ఈ హై-స్పీడ్ సెమీ-లగ్జరీ రైలు కార్యకలాపాలు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభం కానున్నాయి.
Read Also: ఇండియాలో ఇప్పటికీ ఆ రైల్వే లైన్ బ్రిటిషర్లదేనట, ఏటా రాయల్టీ కూడా కట్టించుకుంటున్నారు!