ఆలోచనలు క్రేజీగా ఉంటే, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. స్విట్జర్లాండ్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ కూడా ఇలాగే ఆలోచన చేసింది. రైల్వే ట్రాక్స్ మధ్యన ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుని ఏకంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, వాటి నుంచి కరెంటును తయారు చేస్తోంది. సదరు స్టార్టప్ కంపెనీ ఆలోచనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
రైలు కోసం వేచి చూస్తుండగా ఆలోచన
జోసెఫ్ స్కుడెరి అనే వ్యక్తి సన్ వేస్ అనే సోలార్ స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఆయన 2020లో రైలు కోసం వేచి చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. రైల్వే ట్రాక్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని దేనికైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా? అనుకున్నారు. ఆ తర్వాత తన స్టార్టప్ కంపెనీ ద్వారా స్విట్జర్ లాండ్ ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పెట్టారు. రైల్వే ట్రాక్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ తయారు చేస్తామని చెప్పారు. ఆయన ఆలోచన నచ్చడంతో ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ (FOT) ఓకే చెప్పింది. ఆ తర్వాత స్టార్టప్ కంపెనీ రైల్వే లైన్ లో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది.
100 మీటర్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్
స్విట్జర్లాండ్ ప్రభుత్వ అంగీకారం తర్వాత సన్ వేస్ సోలార్ టెక్నాలజీ స్టార్టప్ రైల్వే ట్రాక్‌ల మధ్య ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తోంది. తాజాగా పైలెట్ ప్రాజెక్టును మొదలు పెట్టింది. సుమారు రూ. 6.04 కోట్ల వ్యయంతో పశ్చిమ స్విట్జర్లాండ్ లోని బుట్టెస్ గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్ ల మధ్య సుమారు 100 మీటర్ల మేర 48 సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. “రైల్వే ట్రాక్ మధ్యలో ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసినట్లుగానే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం. రైలు ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
ముందు నో.. తర్వాత ఓకే..
నిజానికి మొదట్లో సౌర ఫలకాల కారణంగా రైలు భద్రత, నిర్వహణకు ఇబ్బందులు కలుగుతాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నో చెప్పింది. కానీ, ఆ తర్వాత ప్రత్యేకమైన సోలార్ ప్యానెల్స్ రైళ్లకు ఎలాంటి అంతరాయం కలిగించవని నిరూపించింది సన్ వేస్ కంపెనీ. ఆ తర్వాత ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది.
సౌరశక్తిని ఎలా ఉపయోగిస్తారు?
సన్ వేస్ కంపెనీ కథనం ప్రకారం సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫోటోవోల్టాయిక్ కరెంట్ ను మూడు విధాలుగా ఉపయోగించవచ్చు. రైల్వే మౌలిక సదుపాయాలకు (స్విచ్‌లు, సిగ్నల్‌లు, స్టేషన్లు) ఉపయోగించుకోవచ్చు. ఇదే కరెంట్ ను సమీపంలోని స్థానిక GRD (డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఆపరేటర్) కు అందించే అవకాశం ఉంటుంది. అటు లోకో మోటివ్ లకు కూడా విద్యుత్ సరఫరా చేయవచ్చని సన్ వేస్ కంపెనీ వెల్లడించింది.
Read Also: క్రూయిజ్ షిప్ అనుకున్న టైమ్ కి బయల్దేరకపోతే ఫైన్ వేస్తారా? ఆశ్చర్యంగా ఉందే!