Hyderabad Tourism: తెలంగాణలోని పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే టూరిజం పాలసీ 2025-30ని విడుదల చేసింది. భాగ్యనగరంలోని పలు పర్యాటక ప్రదేశాలను గుర్తించింది. వీటిలో హెరిటేజ్ టూరిజానికి సంబంధించిన పలు ప్రదేశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పర్యాటక ప్రదేశాలు ఇవే..
⦿ చార్మినార్
హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే చారిత్రక కట్టడం చార్మినార్. హైదరాబాద్ నడిబొడ్డున 1591 ADలో మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ చార్మినార్ ను నిర్మించారు. హైదరాబాద్ నగరం ప్లేగు వ్యాధితో అల్లకల్లోలం అయిన తర్వాత ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ ఐకానిక్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తించింది.
⦿ గోల్కొండ కోట
హైదరాబాద్ లో అడుగు పెట్టిన ప్రతి పర్యాటకుడు చూడాల్సిన మరో ప్రదేశం గోల్కొండ కోట. ఈ కోటను 11వ శతాబ్దంలో కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు మట్టి గోడలతో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 2014లో, UNESCO దీనిని ప్రపంచ వారసత్వ హోదా కోసం టెంపరరీ లిస్టులో ఉంచింది. నిజాం నవాబులు ఈ కోట కేంద్రంగా పాలన కొనసాగించారు.
⦿ కుతుబ్ షాహీ సమాధులు
కుతుబ్ షాహీ సమాధులు గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న ఇబ్రహీం బాగ్ లో ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహీ రాజవంశం పాలకులు నిర్మించిన సమాధులు మరియు మసీదులు ఉన్నాయి. కొన్ని సమాధులు రెండు అంతస్తులలో నిర్మించారు. ప్రతి సమాధి దాని మధ్యలో ఒక సార్కోఫాగస్ ను కలిగి ఉంది. వీటిని కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశాల లిస్టులో చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి కూడా UNESCO ప్రపంచ వారసత్వ హోదా టెంపరరీ లిస్టులో ఉన్నాయి.
⦿ తారామతి బారాదరి
తారామతి బారాదరి అనేది ఇబ్రహీం బాగ్‌లో ఉన్న ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఇది ఇబ్రహీం కులీ కుతుబ్ షా హయాంలో నిర్మించిన పెర్షియన్- స్టైల్ తోట.
⦿ చౌమహల్లా ప్యాలెస్
చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం పాలకుల రాజ నివాసం. 1720 నుండి 1948 వరకు ఇది అసఫ్ జాహీ రాజవంశానికి అధికార కేంద్రంగా పనిచేసింది. ఈ ప్యాలెస్ ను ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇది ప్రస్తుతం రాజకుటుంబ యాజమాన్యంలో ఉంది.
⦿ సాలార్ జంగ్ మ్యూజియం
ఇది మూసీ నది దక్షిణ ఒడ్డున ఉన్న దార్-ఉల్-షిఫా ఉంది. సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. నిజాం రాజ్యంలో ప్రముఖ హోదాలో కొనసాగిన సాలార్ జంగ్ విదేశాల నుంచి సేకరించిన శిల్పాలు, పెయింటింగ్స్, సిరామిక్స్, మెటల్ కళాఖండాలు సహా అద్భుతమైన చారిత్రక వస్తువులు ఇందులో ఉన్నాయి. కళా అభిమానులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం.
⦿ నిజాం మ్యూజియం
నిజాంల పూర్వపు రాజభవనం అయిన పురాణి హవేలీలో ఉంది. ఈ మ్యూజియంలో హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రజతోత్సవ వేడుకల సందర్భంగా అందుకున్న బహుమతులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. 1936లో ప్రముఖులు సమర్పించిన సావనీర్లు, బహుమతులు, మెమెంటోలు ఇందులో కొలువుదీరాయి.
⦿ లాడ్ బజార్
లాడ్ బజార్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది చార్మినార్ నుంచి వెళ్ళే ప్రధాన రహదారిలో ఒకటి. ఇది మట్టిగాజులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది నగరం నడిబొడ్డున ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ గాజులు, చీరలు, వివాహ ఉపకరణాలు, ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి.
హైదరాబాద్ సమీపంలోని ఇతర పర్యాటక ప్రదేశాలు
ఇక హైదరాబాద్ పరిసరాల్లోని యాదాద్రి, బాసర, నల్గొండ, మెదక్, రామప్ప, అలంపూర్, వేములవాడ, కాళేశ్వరం సహాఇతర ప్రార్థనా స్థలాలు, చారిత్రక ప్రదేశాలను కూడా టూరిజం ప్లేసెస్ లో చేర్చారు అధికారులు.
Read Also: కేరళ లాటరీ టికెట్లను మనం కొనవచ్చా? ఇతర రాష్ట్రాలవారికి ఆ డబ్బు ఇస్తారా?