Hyderabad Forest Camping | కారడవిలో చుట్టూ నిశ్శబ్దం.. చిమ్మ చీకటి.. చల్లటి గాలి.. అలా ప్రకృతి ఒడిలో రాత్రి వేళ వెచ్చని వెలుగుల మధ్య క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇలా ఎందరూ ఊహించుకుంటారు కానీ ఆ కల నిజమవుతుందని తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. మరి హైదరాబాద్ వాసులకు ఈ కల నిజమైంది. నగర వాసులకు అడవిలో నైట్ క్యాంపింగ్ కు అనుమతి లభించింది.
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) రాష్ట్రంలో ఎకో టూరిజం బ్రాండ్, డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయ్ల్స్ పేరుతో ప్రకృతిని ఆస్వాదించడానికి అటవీ ప్రాంతంలో ప్రజలు నైట్ క్యాంపింగ్ , బర్డింగ్ టూర్స్ కు అనుమతిచ్చింది. హైదరాబాద్ లోని పరుగులు తీసే జీవనం నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ప్రజలకు ఇది మంచి అవకాశం. పచ్చని తెలంగాణ అడవుల్లో పర్యటిస్తూ అటవి ప్రకృతి లో ఆహ్లాదం పొందుతూ ఉంటే ఆ అనుభవమే వేరు. రాత్రి వేళ అడవిలో టెంట్లు వేసుకొని చలి మంటలు కాచుకుంటూ ఆకాశంలో నక్షత్రాల కింద శయనించే అనుభూతి పొందే అవకాశం ఇప్పుడు హైదరాబాద్ వాసులకు దక్కింది.
టిజిఎఫ్‌డిసి ఇందుకోసం ఫారెస్ట్ క్యాంపింగ్ టూర్స్ ని నిర్వహిస్తోంది. ముందుగా వికారాబాద్ అడువుల్లో ఫిబ్రవరి 23, మార్చి 23 తేదీలో నేచురల్ ట్రయల్ అట్ వికారాబాద్ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించనుంది.
Also Read: మహాశివరాత్రికి ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ.. శ్రీశైలం, హైదరాబాద్ పర్యటన
ఆ తరువాత హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చిల్కూర్ సమీపంలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వద్ద సిగ్నేచర్ ఓవర్ నైట్ నేచర్ క్యాంపింగ్ ఈవెంట్ ఉంది. మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఈ నైట్ క్యాంపింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
గజ్వేల్ ఫారెస్ట్ బ్లాక్ లో నేచర్ ట్రయల్, బర్డిండ్ పేరుతో మార్చి 2, 30 తేదీల్లో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు.
చివరగా చిల్కూర్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో నేచర్ వాక్ పేరుతో మార్చి 9, 16వ తేదీన ఈవెంట్లు ఉన్నాయి.
ఫారెస్ట్ క్యాంపింగ్ ఈవెంట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం +919885298980 లేదా +919493549399 నెంబర్లకు ఫోన్ చేయగలరు.
ఈ ఫారెస్ట్ క్యాంపింగ్ ఈవెంట్ల గురించి టిజిఎఫ్‌డిసి డైరెక్టర్ రన్‌జీత్ నాయక్ మాట్లాతుడూ.. “అడవుల సంరక్షణ చాలా ముఖ్యం. భూ గ్రహానికి ప్రాణవాయువు నందించే ఊపిరితిత్తులు ఈ అడవులు. మనుషులు వల్ల పెరిగే కాలుష్యం, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువును ఈ అడవులు పీల్చుకుంంటాయి. అంతేకాకుండా అడవిలో ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. అడవిలోని పక్షలు, నిశాచరాలు, జంతువులు ఒక ఫుడ్ చెయిన్ లా ఏర్పడి ఈ భూగ్రహ వాతావరణాన్ని సమతుల్యంలో ఉంచుతున్నాయి. ఇదే కాకుండా ఈ అడవుల్లో సమయం గడిపితే మనిషికి మానసికంగా ప్రకృతితో బంధం ఏర్పడుతుంది” అని వ్యాఖ్యానించారు. . సఫారీ, ట్రెక్కింగ్, పక్షులను చూసేందుకు డెక్‌లు.. ఇలా చాలానే ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.