Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్ పేరుకు మాత్రమే కాదు, ఇప్పుడు కొత్త అర్ధం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుపతిలో భక్తుల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతుండటంతో, రైల్వే శాఖ భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. పాత రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ. 900 కోట్లకు పైగా వ్యయంతో అమృత్ భారత్ పథకం కింద ఈ స్టేషన్ అభివృద్ధి జరుగుతోంది.
నిర్మాణాలు.. వివరాలు
ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులు రెండు ప్రధాన దిశల్లో సాగుతున్నాయి. ఒకవైపు గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం దక్షిణ గేటు వైపు నిర్మాణంలో ఉండగా, మరొకవైపు ఉత్తర గేటుకు ఆనుకుని ఇదే తరహాలో మరో కొత్త భవనం నిర్మిస్తున్నారు. ఈ రెండు భవనాల్లో రాకపోకలు సులభతరం చేసేందుకు భారీ ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 12 ఎస్కలేటర్లు, 10 లిఫ్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ప్రయాణికుల తరహాలో అత్యంత అవసరమైన సౌకర్యాలు.
వెయిటింగ్ హాల్.. అద్భుతంగా!
ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. 35 మీటర్ల వెడల్పుతో రెండు ఎయిర్ కాన్‌కోర్సులు నిర్మిస్తున్నారు. ఇవి రెండు వైపులా ఉన్న ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ, రోజూ ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ లేకుండా కదలాడే అవకాశం కల్పించనున్నాయి. ప్లాట్‌ఫాం 4, 5 వద్ద 210 మందికి సామర్థ్యం ఉన్న ఆధునిక వెయిటింగ్ హాల్ కూడా అందుబాటులోకి రాబోతోంది. వీటితోపాటు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
నిధుల లెక్క..
ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 311 కోట్ల వ్యయం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ వైపు భవనం పనులు 70% పూర్తయ్యాయి. ఉత్తర వైపు నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. 2025 ప్రారంభ నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇన్ని సదుపాయాలా?
ఈ అభివృద్ధి కేవలం భవనాల రూపంలో మాత్రమే కాక, ప్రయాణికులకు కావలసిన సౌకర్యాల పరంగా కూడా విస్తృతంగా ఉంది. స్టేషన్‌లో అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ, భారీ నీటి నిల్వ ట్యాంకులు, ఫుడ్ కోర్టులు, ప్రీమియం లౌంజ్‌లు, హైస్పీడ్ WiFi వంటి ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫాం 1 వద్ద కొత్తగా 350 చదరపు మీటర్ల ప్రీమియం లౌంజ్ ఏర్పాటు అవుతోంది. ప్రయాణికుల కోసం నూతన టికెట్ కౌంటర్లు, క్లాక్‌రూమ్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు కూడా ఏర్పాటవుతున్నాయి.
Also Read: Hyderabad electric buses: హైదరాబాద్ కు అన్ని బస్సులా? ఇకపై మెట్రో పరిస్థితి ఏంటో?
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, తిరుపతి స్టేషన్ రోజుకు సగటున 1.5 లక్షల ప్రయాణికులను మునుపెన్నడూ లేని వెసులుబాటుతో ఆశీర్వదించనుంది. భక్తులకి మెరుగైన అనుభవాన్ని అందించడమే కాక, దక్షిణ రైల్వేలో అత్యాధునిక స్టేషన్‌గా పేరు పొందేలా మారుతుంది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ప్రతి దశను పర్యవేక్షిస్తూ, సమయానికి పనులు పూర్తవ్వాలన్న నిబద్ధతతో ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.
ప్రయాణికులే కాదు, స్థానికులు కూడా ఈ అభివృద్ధికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇది కేవలం స్టేషన్ రూపం మాత్రమే మార్చడం కాదు.. తిరుపతి నగరానికి చెందిన బ్రాండ్ విలువను దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా పెంచే అవకాశముంది. ఇక భవిష్యత్‌లో మెట్రో, బస్ టెర్మినల్ వంటి ప్రాజెక్టులతో కలిపి చూస్తే, తిరుపతి పూర్తిస్థాయి ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కేవలం మాటల్లో కాదు. ఇది భక్తుల భద్రత, ప్రయాణికుల సౌకర్యం, నగర అభివృద్ధి అన్నింటికీ ప్రతిబింబంగా నిలుస్తోంది. రూ. 900 కోట్లతో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, తిరుపతిలోకి అడుగు పెట్టే ప్రతి ప్రయాణికుడికి ఇది దేవుడి నగరం.. కానీ అభివృద్ధి విషయంలో దేవుడు మీదే కాదు, మన ప్రభుత్వం మీద కూడా నమ్మకం పెట్టొచ్చు అనిపించక మానదు!