Pondicherry Tour: భారతదేశంలోనే ఫ్రాన్స్‌ను చూడాలనుకుంటే.. మీరు పాండిచ్చేరికి వెళ్లాలి. భారతదేశ ఫ్రాన్స్ అని కూడా పాండిచ్చేరిని పిలుస్తారు. ఒకప్పుడు ఫ్రెంచ్ వలస స్థావరంగా ఉన్న ఈ నగరం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక్కడి వాస్తుశిల్పం, సముద్రం, అందమైన బ్యాక్ వాటర్స్, పచ్చదనం, క్రియోల్ వంటకాలు, అద్భుతమైన వాతావరణం మిమ్మల్ని తప్పకుండా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ప్రకృతిని ఆస్వాదించడమే కాకుండా.. ఇక్కడికి టూర్ వెళ్తే.. రకరకాల అడ్వేంచర్స్ కూడా చేయొచ్చు. మొత్తం మీద పాండిచ్చేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. కనీసం ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. మీరు కూడా ఈ అందమైన నగరాన్ని చూడాలనుకుంటే ఇక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ముందుగా తెలుసుకోండి.
ఆరోవిల్లే:
ఆరోవిల్లె పాండిచ్చేరి శివార్లలో ఉన్న ఒక పట్టణం. ఇక్కడ 50 కి పైగా దేశాల ప్రజలు నివసిస్తున్నారు. అనేక సంస్కృతుల కలయికకు చిహ్నంగా ఉన్న ఈ పట్టణాన్ని 1968 లో అరబిందో శిష్యురాలు మీరా అల్ఫాస్సా స్థాపించారు. ధ్యానం, యోగా, ఆయుర్వేదం వంటి వైద్య వ్యవస్థలు ఇక్కడి ప్రత్యేకతలు. ఇక్కడ ఉన్న మాతృ మందిరాన్ని పర్యాటకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక్కడికి నిత్యం వేలాది మంది వస్తుంటారు.
బసిలికా ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్:
ఇది సౌత్ బౌలేవార్డ్ వీధిలో ఉన్న ఒక పురాతన కాథలిక్ చర్చి ఇది. ఈ చర్చి లోపల ప్రశాంతత, వెలుపల ఉన్న వాస్తు శిల్పం రెండూ అద్భుత అనుభూతిని కలిగిస్తాయి. అంతే కాకుండా ఈ చర్చిపై అందమైన శిల్పాలు కూడా ఉంటాయి. దాని కోణాల తోరణాలు, రంగురంగుల గాజు కిటికీలు, సాధువుల విగ్రహాలు మొదలైనవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
అరవింద్ ఆశ్రమం:
అరవింద్ ఆశ్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రావడం ద్వారా మీరు జీవిత సారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది యోగా, ధ్యానం , సంస్కృతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ‘ఆశ్రమం’. యోగా తరగతులతో పాటు, అనేక వర్క్‌షాప్‌లు , సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని 1926 లో గొప్ప తత్వవేత్త, యోగా, ఆధ్యాత్మిక నాయకుడు అరబిందో ఘోష్ , మీరా అల్ఫాసా స్థాపించారు.
ప్రొమెనేడ్ బీచ్:
ప్రొమెనేడ్ బీచ్ ను పాండిచ్చేరి బీచ్, రాక్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ మీ హృదయానికి ప్రశాంతతను అందిస్తుంది. అంతే కాకుండా ఇక్కడి బంగారు రంగు ఇసుక, సముద్రపు అలలు , చల్లని గాలి మీ ఒత్తిడినంతా తొలగిస్తాయి. ఇక్కడ సూర్యోదయం , సూర్యాస్తమయం రెండూ అద్భుతమైన దృశ్యాలతో నిండి ఉంటాయి.
రాజ్ నివాస్:
ఈ అద్భుతమైన భవనం ఒకప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ నివాసం. అందుకే ఈ భవనం నిర్మాణం ఫ్రాన్స్ ప్రభావంతో ఉన్నట్లు కనిపిస్తుంది. విశాలమైన పచ్చిక బయళ్ళు, గ్రాండ్ కారిడార్లు, రాజ తోరణాలు అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన నివాసం మీకు పురాతన కాలం నాటి వైభవాన్ని చూపుతుంది.
Also Read: ఇండియాలోని.. 5 రహస్య ఆలయాలు ఇవే !
శ్రీ వేదపురీశ్వర ఆలయం:
పాండిచ్చేరిలో చర్చితో పాటు అనేక గొప్ప దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి శ్రీ వేదపురీశ్వర ఆలయం. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయ నిర్మాణం చాలా గొప్పది. ఈ పురాతన ఆలయంలోని శిల్పాలు, ఏడు రాజగోపురాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న దేవత వేదపురీశ్వరర్, స్థానిక ప్రజలకు విశ్వాసానికి ఇది చిహ్నం.