Himachal Tourism: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వరదల కారణంగా 54 మంది చనిపోయారు. సుమారు రూ. 750 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టూరిస్టులు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లు, హోటళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టూరిజం అధికారుల కీలక నిర్ణయం
పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HPTDC) పలు విషయలు వెల్లడించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వల్ల టూరిస్టులు భయపడుతున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలు చాలా తక్కువ ఉన్నారు. వరదలు లేని పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయన్నారు. జూలై 2024 మొదటి వారంలో 29% ఆక్యుపెన్సీ ఉండగా, ఈ ఏడాది జూలై మొదటి వారంలో 21% తగ్గిందన్నారు. కేవలం 8 శాతం మంది పర్యాటకులు తగ్గారని చెప్పుకొచ్చారు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్. సందర్శకుల సంఖ్య తగ్గడానికి సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రసారమే కారణం అన్నారు.
హోటళ్ల బుకింగ్ పై 40 శాతం డిస్కౌంట్
పర్యాటక రంగాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు HPTDC జూలై 15 నుంచి సెప్టెంబర్ 12 మధ్య హోటళ్లను బుక్ చేసుకునే వారికి 40% వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. కిన్నౌర్, లాహౌల్-స్పితి, పాంగి-భర్మౌర్ గిరిజన ప్రాంతాలలో పర్యటించే టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతాలు వర్షా కాలంలో మరింత ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియా వార్తలపై హోటల యజమానుల ఆగ్రహం
అటు హిమాచల్ ప్రదేశ్ లో టూరిజం తగ్గడానికి కారణం సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం అని ఆ రాష్ట్ర హోటల్స్ యజమానాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమ్లా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రిన్స్ కుక్రేజా కీలక విషయాలు వెల్లడించారు. “గత 10 రోజులుగా సిమ్లాలో తక్కువ వర్షాలు కురిశాయి. అన్ని రహదారులు చక్కగా ఉన్నాయి. అయినప్పటికీ, నిరాధారమైన సోషల్ మీడియా పోస్టులు టూరిస్టులలో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. మరికొంత మంది టూర్లు రద్దు చేసుకునేందుకు కారణం అవుతున్నాయి” అని చెప్పుకొచ్చారు. అటు జూలై మొదటి వారంలో దాదాపు 80% బుకింగ్‌లు రద్దు చేయబడినట్లు టూర్ ఆపరేటర్లు తెలిపారు.
గత వారం రోజులుగా కురిసిన వానల కారణంగా మండి జిల్లా బాగా ఇబ్బంది పడింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి అనేక సంఘటనలు తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. ఇతర ప్రాంతాలలో కొన్ని అంతరాయాలు ఏర్పడినా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Read Also: న్యూస్ చూసి స్పాట్ కు వెళ్లిన వృద్ధ జంట, అదంతా అబద్దం అని తెలిసి షాక్!