Vande Bharat Cleanliness Row: వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంటే వేగంతో పాటు పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాలకు కేరాఫ్ అడ్రస్ గా చాలామంది భావిస్తారు. అయితే, తాజాగా ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. రైలులోని టాయిలెట్లు, బోగీలు, కోచ్ ల లోపల పేరుకుపోయిన మురికి గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం రైల్వే అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు.
రైల్వే ప్రయాణాలను ఇష్టపడే ఓ వ్యక్తి ఇటీవల వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలు బయటవైపు కొన్ని అద్దాలు పగిలిపోయినట్లు ఆయన గుర్తించారు. అలాగే టాయిలెట్ లో కూడా నీట్ నెస్ లేకపోవడాన్ని గమనించాడు. ముఖ్యంగా టాయిలెట్ లోని కొన్ని భాగాలు తుప్పు పట్టినట్టుగా కనిపించడంతో వాటి ఫొటోలను తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా పరిశుభ్రత, ఆధునిక సౌకర్యాలకు పేరున్న వందే భారత్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఈ అసాధారణ పరిస్థితిని అక్టోబర్ 2న గమనించినట్లు సదరు ప్రయాణికుడు తెలిపాడు. సబర్మతి నుంచి వేరావల్ వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ సమస్యలను గుర్తించినట్లు వివరించాడు. రైలు నంబర్ 26901లో ప్రయాణించినట్లు తన పోస్టులో వెల్లడించాడు. వందే భారత్ వంటి ప్రతిష్టాత్మక రైలులో పగిలిన అద్దాలు, తుప్పు పట్టిన టాయిలెట్లు కనిపించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. రైళ్లను కొత్తగా తీసుకురావడంతో పాటు వాటి నిర్వహణపైనా అదే స్థాయిలో శ్రద్ధ పెట్టాలని సూచించాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆధునిక రైళ్లను నిర్మించడం మాత్రమే కాకుండా వాటిని నిరంతరం శుభ్రంగా, మంచి కండీషన్ లో ఉంచాల్సిన బాధ్యత కూడా ఉందని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు ప్రయాణికుల ప్రవర్తనపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రయాణికులు కూడా బాధ్యతగా ఉపయోగించాలని సూచించారు. మరోవైపు, కొత్తగా ప్రారంభించే మోడ్రన్ రైళ్లకు ప్రారంభం నుంచే నిర్వహణపై ప్రత్యేక దృష్టి అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ప్రయాణికుడి ఫిర్యాదుపై రైల్వే అధికారులు ఆలస్యం చేయకుండా స్పందించారు. అహ్మదాబాద్ డివిజన్ డీఆర్ఎం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుడు చూపించిన ప్రాంతాల పరిస్థితి తమ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంగీకరించారు. అయితే, ఇది రైలులోని అన్ని ప్రాంతాల పరిస్థితిని సూచించదని, అక్కడక్కడా జరిగిన కొన్ని ఘటనలుగా అధికారులు వివరించారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రాంతాలపై నిర్వహణ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. సమస్యలను సరిదిద్దిన తర్వాత తీసిన ఫొటోలను కూడా ప్రయాణికుడితో పంచుకున్నట్లు తెలిపారు.
Read Also: హైదరాబాద్ బుల్లెట్ రైళ్ల స్పీడుపై షాకింగ్ అప్‌డేట్.. ఏంటీ, మరీ అంత తక్కువా?