Visakhapatnam Abu Dhabi Flight: ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగం రోజు రోజుకు విస్తరిస్తోంది. రాష్ట్రం అంతగా కనెక్టివిటీని పెంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు ఏపీలోని పలు ఇతర నగరాలతో పాటు అంతర్జాతీయ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ మేరకు కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇంతకీ రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారంటే..
విశాఖ నుంచి అబుదాబికి విమాన సర్వీసులు
ఇప్పటికే విశాఖపట్నం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇకపై పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్స్ జూన్ 13 నుంచి అబుదాబికి సర్వీసులను నడపబోతున్నాయి. వారానికి నాలుగు రోజులు ఈ విమానాలు రాకపోకలు కొనసాగించనున్నాయి. జూన్ 12 నుంచి మరో ఇండిగో విమానం విశాఖపట్నం- భువనేశ్వర్ నడుమ సర్వీసులను కొనసాగించనుంది. ఈ విమాన సర్వీసు ద్వారా ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రాజధాని మధ్య సంబంధాలను బలోపేతం చేయనుంది. అటు జూన్ 2 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విజయవాడ-బెంగళూరు మధ్య సేవలను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని దేశంలోని ప్రధాన టెక్ హబ్ లలో ఒకటైన బెంగళూరును కలుపుతుంది.
రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?
కొత్త విమాన సర్వీసుల ప్రారంభం పట్ల విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సర్వీసులను విస్తరిస్తూ రాష్ట్రం అంతటా కనెక్టివిటీని పెంచడానికి కొత్త విమాన సేవలు ప్రారంభించబడుతున్నాయని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ విమాన సర్వీసుల ప్రారంభం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దర్శనిక నాయకత్వానికి నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడంలో ఈ అనుసంధానం మరో ముందడుగు కాబోతోంది” అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Read Also: ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫ్లైట్ జర్నీ, త్వరలో అందుబాటులోకి!
విశాఖ- విజయవాడ మధ్య విమాన సర్వీసులు
ఇప్పటికే విశాఖ-విజయవాడ మధ్య జూన్ 1 నుంచి ఈ విమానా సేవలు అందుబాటులోకి రాబోతున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖపట్నం- విజయవాడ నడుమ ఉదయపు విమాన సేవలు ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. ఈ విమాన సర్వీసులు ఏపీ రవాణా కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడను, ఆర్థిక కేంద్రం విశాఖపట్నం మధ్య మెరుగైన రాకపోకలకు ఉపయోగపడుతాయన్నారు. “ఇండిగో విమానం ఉదయం 7.15 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరుతుంది. ఉదయం 8.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే విమానం ఉదయం 8.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. ఉదయం 9.50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీస్ జూన్ 1 నుండి తిరిగి ప్రారంభమవుతుంది” అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Read Also: ఆహా ఎంత అద్భుతమో.. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలు ఇవే!