India’s Longest Glass Bridge: ప్రకృతి అందాలకు నెలవైన విశాఖలో మరో అద్భుత కట్టడం రాబోతోంది. దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన నిర్మాణం కాబోతోంది. కైలాసగిరి దగ్గర ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో సుమారు 50 మీటర్ల మేర కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు. రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన సముద్రంతో పాటు చుట్టుపక్కల కొండలకు సంబంధించిన అద్భుత దృశ్యాలను అందించనుంది. విశాఖ పర్యాటక రంగాన్ని ఈ బ్రిడ్జి మరింత మెరుగుపరచనుంది. నవంబర్ 18న గాజు వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. సుమారు 6 నెలల వ్యవధిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
పర్యాటకులకు థ్రిల్లింగ్ అడ్వెంచర్
విశాఖ నగరంతో పాటు పర్యాటకులకు ఈ ప్రాజెక్ట్ థ్రిల్లింగ్ అడ్వెంచర్‌ను అందించడంతో పాటు కైలాసగిరి సహజ సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన అనేది పాదచారుల వంతెన. ఈ ప్రాజెక్టును విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA), SSM షిప్పింగ్ & లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ అయిన RJ అడ్వెంచర్స్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్దతిన నిర్మిస్తున్నది. ఈ బ్రిడ్జితో విశాఖ టూరిజం మరింత డెవలప్ అవుతోందని భారత్ మాతా వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జోమీ పూనోలి వెల్లడించారు. “ఈ వంతెన ఒకేసారి 40 మంది వరకు కూర్చునేలా రూపొందించబడింది. సందర్శకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ కలిగిస్తున్నది. అడ్వెంచర్ టూరిజానికి విశాఖ డెస్టినేషన్ గా మారబోతోంది” అన్నారు.
Read Also: విశాఖ నుంచి థాయ్‌లాండ్ ట్రిప్.. వీసా లేకుండానే చెక్కేయొచ్చు, టికెట్ కూడా చాలా చీప్ గురూ!
కేరళ గాజు వంతెనను మించి..
ప్రస్తుతం కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జ్ 40 మీటర్ల పొడవు ఉంది. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ వంతెనగా రికార్డు పొందింది. ఇడుక్కి జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ అడ్వెంచర్ పార్క్ లో ఉన్న ఈ బ్రిడ్జి ప్రకృతి అందాలను చూసేందుకు అనువుగా నిర్మించారు. ఇప్పుడు విశాఖలో నిర్మించే గ్లాస్ బ్రిడ్జి భారత్ లోనే అతి పెద్ద గ్లాస్ బ్రిజ్జిగా నిలువబోతోంది. అటు గ్లాస్ బ్రిడ్జికి అనుబంధంగా.. టు వే జిప్ లైన్, స్కై-సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేశారు. ప్రతి మార్గంలో 150 మీటర్ల పొడవు చొప్పున, మొత్తం 300 మీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటికే రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించగా, త్వరలో ప్రారంభంకానున్నాయి. VMRDA నుంచి తుది అనుమతులు లభించిన తర్వాత స్కై-సైక్లింగ్, జిప్-లైన్లకు సంబంధించిన ప్రారంభ తేదీ, టిక్కెట్ ధర ఖరారు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కైలాసగిరిలో అడ్వెంచర్ టూరిజం అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్మాణాలను చేపట్టారు. ఈ గాజు బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. విశాఖ తీరప్రాంతపు అందాలను మరింత అద్భుతమైన వ్యూతో చూసే అవకాశం ఉంది.
Read Also: పెళ్లి కొడుకు ఎక్కిన రైలు లేటు.. వెంటనే రైల్వే అధికారులు ఏం చేశారో తెలుసా? మీరు ఊహించలేరు!