Indian Railway: సాధారణంగా రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్ లో రైల్వే సిబ్బంది టికెట్లు అమ్ముతారు. కానీ, అదే కౌంటర్ లో ఏ సంబంధం లేని వ్యక్తి టికెట్లు అమ్మితే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబైలోని ఓ స్టేషన్ లో బయటి వ్యక్తి రైలు టికెట్లు జారీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని.. నలుగురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ రైల్వే కీలక ప్రకటన చేసింది.
సమాచారం తెలుసుకుని స్పాట్ కు వచ్చిన అధికారులు
టికెట్ కౌంటర్ లో రైల్వేతో సంబంధం లేని వ్యక్తి టికెట్లు అమ్ముతున్నాడని తెలుసుకున్న రైల్వే విజిలెన్స్ అధికారులు, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పశ్చిమ శివారులోని మాహిమ్ స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో వినోద్ అనే వ్యక్తి రైల్వే సిబ్బంది తరపున టికెట్లు అమ్ముతున్నాడని గుర్తించారు. రైల్వే నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ప్రైవేట్ వ్యక్తుల చేత టికెట్లు అమ్మిస్తున్న సదరు రైల్వే టికెట్ కౌంటర్ సిబ్బంది సస్పెండ్ చేయడంతో పాటు టికెట్లు అమ్ముతున్న వినోద్ నో రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ వెల్లడించారు.
స్టేషన్ లోని అన్ని కౌంటర్లను పరిశీలించిన అధికారులు
మాహిం స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నంబర్ 1లోని బుకింగ్ కార్యాలయంలోకి వెళ్లడానికి ముందు విజిలెన్స్ బృందం దాదాపు గంటన్నర పాటు మూడు యాక్టివ్ టికెట్ కౌంటర్ల పని తీరును పరిశీలించింది. స్టేషన్ మాస్టర్‌తో కలిసి రాత్రి 8.30 గంటల సమయంలో ఆ బృందం కార్యాలయంలోకి ఎంటర్ అయ్యింది. ఆ సమయంలో రైల్వేకు చెందని వ్యక్తి కౌంటర్ నుంచి టికెట్ల జారీ చేస్తూ, ఎటువంటి అధికారిక అనుమతి లేకుండా ప్రభుత్వ నగదును నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బుకింగ్ కౌంటర్ సిబ్బంది అందరూ కార్యాలయం లోపల ఒక గదిలో కలిసి కూర్చుని స్నాక్స్ తింటున్నట్లు గుర్తించారు. బయటి వ్యక్తి టికెట్ అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. రెగ్యులర్ సిబ్బంది తనను టికెట్లు అమ్మమని అడిగారని, వారితో ఉన్న పరిచయం కారణంగా అమ్మానని చెప్పారు. ఇలా చేయడం కచ్చితంగా రైల్వే నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. విజిలెన్స్ బృందం సదరు వ్యక్తి నుంచి రూ.2,650 స్వాధీనం చేసుకుంది. ఆ డబ్బును రైల్వే కౌంటర్ లో జమ చేసినట్లు వివరించారు.
సస్పెండ్ అయిన సిబ్బంది ఎవరంటే?
ఇక టికెట్ కౌంటర్ కు సంబంధించి నలుగురు సిబ్బందిని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వారిలో అంగద్ దేవిదాస్ ధావలే (CBS/జనరల్), రామశంకర్ R (CBS/ఈవినింగ్ ఇన్-ఛార్జ్), గణేష్ పాటిల్ (CBS), విజయ్ దేవడిగా (CBC) ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ ఘటనపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also: ఇక జనరల్ టికెట్ కౌంటర్లు క్లోజ్, రైల్వే సంచలన నిర్ణయం!