Airplane Ashtrays: విమాన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఒక నిబంధన కచ్చితంగా తెలుసు. అదేంటంటే విమానంలో సిగరెట్ కాల్చడం (స్మోకింగ్) పూర్తిగా నిషేధం. ప్రయాణికులకు భద్రతా సూచనల ద్వారా హెచ్చరిక బోర్డుల ద్వారా ఈ విషయం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటారు. అయితే ఎవరూ స్మోక్ చేయడానికి వీలులేనప్పుడు.. విమానాల్లోని బాత్రూమ్ తలుపుల దగ్గర లేదా లోపల చిన్న మెటల్ యాష్ ట్రే (బూడిద కుండీ) ఎందుకు ఉంటుంది? ఎవరికైనా ఈ అనుమానం వచ్చిందా? దీని వెనకున్న కారణాలు తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు.
విమాన బాత్రూమ్‌లో యాష్ ట్రే ఉందంటే, అక్కడ స్మోక్ చేయడానికి అనుమతి ఉందని అర్థం కాదు. ప్రయాణికులు ఎవరూ దానిని స్మోకింగ్ జోన్‌గా భావించడానికి వీలులేదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి, నిషిద్ధమైన పనిని రహస్యంగా చేస్తే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే విమాన డిజైనర్లు, భద్రతా నిపుణులు ఈ ఏర్పాట్లు చేశారు. ఎవరైనా తప్పు చేసినా సిగరెట్ ను ఎక్కడ పడితే అక్కడ పడేసి ప్రమాదానికి కారణం కాకుండా ఉండేందుకు ఇలా యాష్ ట్రేలను ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశంగా నిపుణులు చెబుతున్నారు.
విమానంలోని బాత్రూమ్ చెత్తబుట్టలో వాడిన టిష్యూ పేపర్లు, నాప్‌కిన్లు, ఇతర చెత్త ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రహస్యంగా సిగరెట్ కాల్చి అది పూర్తిగా ఆరిపోకుండానే ఆ చెత్తబుట్టలో పడేస్తే వేడికి చెత్తకు మంటలంటుకునే ప్రమాదం ఉంది. వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానంలో చిన్న మంట కూడా క్షణాల్లో పెద్ద ప్రమాదంగా మారవచ్చు. అందుకే చెత్తబుట్టలో పడేయడం కంటే మెటల్ యాష్ ట్రేలో సిగరెట్ ను ఆర్పివేయడం చాలా బెటర్.
భూమి మీద ఒక భవనంలో ప్రమాదం జరిగితే వెంటనే బయటకు పారిపోవచ్చు. కానీ ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో అలా వెంటనే ఖాళీ చేయడం సాధ్యం కాదు. పొగ కమ్ముకుంటే ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడతారు. అందుకే విమానంలో అగ్నిప్రమాదాలను అరికట్టడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. బాత్రూమ్ అనేది ప్రయాణికులు ఒంటరిగా, సిబ్బంది కంటికి కనిపించకుండా వెళ్లే ప్రాంతం కాబట్టి అక్కడ ప్రత్యేకమైన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. బాత్రూమ్ లలో స్మోక్ డిటెక్టర్లు పెట్టి.. సిగరేట్ తాగిన వారిని ఈజీగా గుర్తిస్తారు.
Also Read: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. సీజేఐకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ షాకింగ్ అంశాల ప్రస్తావన!
విమానంలో స్మోక్ చేయడం చట్టరీత్యా నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే విమానయాన సంస్థలు, చట్టం నుండి తీవ్రమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి విమాన బాత్రూమ్‌లో యాష్ ట్రే కనిపిస్తే అది స్మోకింగ్ చేయడానికి ఇచ్చిన అనుమతి అని పొరపాటున కూడా అనుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే జరగబోయే ప్రమాదాన్ని నివారించడానికి ఏర్పాటు చేసిన ఒక ముందస్తు రక్షణ చర్య మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.