Heart Aerospace X1: విమానయాన రంగంలో కీలక ముందడుగు పడింది. హార్ట్ ఏరోస్పేస్ సంస్థ తొలిసారి ఎలక్ట్రిక్ ఏరో ప్లేన్ ను సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది. ఆగస్టు 12న న్యూయార్క్ లోని ప్లాట్స్‌బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం తొలి ప్రయోగం జరిగింది. సుమారు 11.3 టన్నుల బరువున్న X1 విమానం 27 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ సమయంలో 335 మీటర్లు అంటే 1,100 అడుగుల ఎత్తుకు చేరుకుంది. విమానానికి నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ విమానం రెక్కలు దాదాపు 32 మీటర్ల వెడల్పు కలిగిన ఉన్నాయి. X1 ఇప్పటి వరకు ఎగిరిన అతిపెద్ద బ్యాటరీ ఎలక్ట్రిక్ విమానంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రయోగంలో మరో విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. 27 నిమిషాల విమాన ప్రయాణానికి ఉపయోగించిన విద్యుత్ విలువ కేవలం 5 డాలర్లు. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ.478. X1ను సాధారణ ప్రయాణికుల విమానంగా ఉపయోగించేందుకు తయారు చేయలేదు. భవిష్యత్ లో హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేయాలనుకుంటున్న ES-30 ప్రాంతీయ విమానానికి అవసరమైన సాంకేతికతను పరీక్షించడమే ప్రధాన ఉద్దేశం. ES-30లో 30 మంది ప్రయాణికులు ప్రయాణించేలా సంస్థ ప్రణాళిక రూపొందించింది. పూర్తిగా విద్యుత్ తో సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉండేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విధానంలో ఈ పరిధిని 800 కిలోమీటర్ల వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
హార్ట్ ఏరోస్పేస్ 2019లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదట చిన్న ఎలక్ట్రిక్ విమాన నమూనాలతో ప్రయోగాలు చేసిన సంస్థ, తర్వాత ES-30 కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. 2021లో 35 మిలియన్ డాలర్ల (సుమారు రూ.335 కోట్లు) పెట్టుబడిని సంపాదించింది. 2024లో మరో 107 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,023 కోట్లు) నిధులను పొందింది. 2024లో X1ను ఆవిష్కరించిన తర్వాత పలు పరీక్షలు నిర్వహించారు. 2026 జూలైలో FAA నుంచి ప్రత్యేక అనుమతి లభించడంతో విమాన పరీక్షలకు మార్గం సుగమమైంది.
X1 ప్రయోగం విజయవంతమైనప్పటికీ, ప్రయాణికులను తీసుకెళ్లే వాణిజ్య విమానం అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2028లో మళ్లీ విమాన పరీక్షలను నిర్వహించాలని హార్ట్ ఏరోస్పేస్ భావిస్తోంది. ES-30కు టైప్ సర్టిఫికేషన్ పూర్తి చేసి 2031 నాటికి సేవల్లోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే చిన్న నగరాలు, ప్రాంతీయ విమానాశ్రయాల మధ్య తక్కువ దూర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ విమానాలు ఉపయోగపడే అవకాశం ఉంది.
Read Also: మాల్దీవ్స్ కు వెళ్లే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఇక అందుబాటులోకి మరిన్ని విమానాలు!