Legal Notice to Swarnagiri Temple: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన ఆన్‌లైన్ సేవల విషయంలో దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా, భక్తుల్లో అయోమయం కలిగించే విధంగా వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భువనగిరి శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ‘YTD’ (Yadadri Temple Development) పేరుతో అధికారిక గెజిట్‌ను విడుదల చేసింది. ఈ బ్రాండ్ పేరును ఇతరులు తమ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే, స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులు ytdtemple.com పేరుతో మరో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఇప్పటికే swarnagiritemple.com పేరుతో అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. పూజలు, సేవలు, ఆన్‌లైన్ బుకింగ్ తదితర వివరాలను భక్తులు ఆ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్‌సైట్ ఇప్పటికే ఉన్నప్పటికీ.. YTD పేరుతో మరో సైట్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారనే అంశంపై యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ytdtemple.com వెబ్‌సైట్‌లో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పోలి ఉండే ఫొటోలు, వివరాలు కనిపించడంపై కూడా ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు ఏది యాదగిరిగుట్ట దేవస్థానం అధికారిక వెబ్‌సైట్? ఏది ఇతర సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్? అనే విషయంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఆన్‌లైన్ సేవలు, దర్శనం, పూజలు, విరాళాలు వంటి వాటి కోసం వెబ్‌సైట్లను ఉపయోగించే భక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వ గెజిట్‌లోని నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు లీగల్ నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా రూపొందించినట్లు పేర్కొన్న ytdtemple.com వెబ్‌సైట్‌ను నిలిపివేయాలని నోటీసులో సూచించినట్లు సమాచారం. అలా చేయని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
యాదగిరిగుట్ట దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన మరికొన్ని వెబ్‌సైట్లు, పోర్టల్స్ కూడా తమ దృష్టికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాటి నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. దీంతో భక్తులు ఆన్‌లైన్ సేవలు పొందే సమయంలో వెబ్‌సైట్ చిరునామాను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని సూచిస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి అధికారిక వెబ్‌సైట్ (yadagiriguttatemple.telangana.gov.in) ఒక్కటే ఉందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఆలయ సేవలు, పూజలు, ఇతర ఆన్‌లైన్ సదుపాయాల కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించారు. అటు లీగల్ నోటీసుల తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!