భారతీయ విమానయాన రంగానికి అనుసంధానంగా మరొక కొత్త వ్యాపారం మొదలవ్వబోతోంది. ఈ కొత్త స్టార్టప్ భారీ స్థాయిలో ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. జొమోటో సీఈవో దీపిందర్ గోయల్, మాజీ జొమోటో ఉద్యోగి సురభి దాస్ కలిసి కొత్త భారతీయ విమాన స్టార్టప్ ను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.
బస్సులను నడుపుతున్నట్టు చిన్న విమానాలను కూడా నడపాలి అన్నది వారి ఆలోచన. అందుకే LAT ఏరోస్పేస్ స్టార్టప్ లో జొమోటో సీఈవో పెట్టుబడులు పెట్టారు. ఈ ఏరోస్పేస్ స్టార్టప్ ను మొదలుపెట్టింది సురభిదాస్. ఆమె గతంలో జొమోటోలో పనిచేశారు.
తక్కువ ధరకే విమానయానం
ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని పెంచేందుకు, చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని వీరిద్దరూ భావిస్తున్నారు. విమాన ప్రయాణం అనేది ఇప్పటికీ ఖరీదైనదిగా, అరుదైనదిగా కనిపిస్తోంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు బస్సుల్లో, మెట్రోలో ప్రయాణించేందుకే ఆసక్తి చూపిస్తున్నారని సురభి దాస్ వివరించారు. ఇతర దేశాల మాదిరిగానే చిన్న చిన్న దూరాలకు కూడా విమానాలు నడిపితే ప్రజలు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకుంటారని వీరు భావిస్తున్నారు. అయితే విమానయానం అనగానే చాలా ఖరీదైనదిగా భావిస్తారు ఎంతోమంది ప్రజలు. అందుకే దీన్ని చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని ఈ కొత్త స్టార్టప్ నిర్వాహకులు భావిస్తున్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా లక్షలాది మంది రోడ్డు లేదా రైలు ద్వారానే ప్రయాణిస్తున్నారు. వారికి తక్కువ ధరకే విమానయానాన్ని అందుబాటులోకి తెస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నది సురభిదాస్ ఆలోచన.
ఈ స్టార్టప్ ద్వారా చిన్న విమానాలను తయారు చేస్తారు. ఒక విమానంలో 12 నుంచి 24 మంది మాత్రమే కూర్చునే విధంగా రూపొందిస్తారు. దీని టిక్కెట్ ధర కూడా తక్కువే పెట్టాలన్నది సురభి దాస్ ఆలోచన. చిన్న ఎయిర్ స్ట్రిప్పుల నుండి ఈ చిన్న విమానాలను నడపాలన్నది ఈ స్టార్టప్ యోచిస్తోంది.
ఖాళీగా ఎయిర్ స్ట్రిప్పులు
మనదేశంలో 450 కి పైగా ఎయిడ్స్ స్ట్రిప్ లు ఉన్నాయి. అంటే విమానం టేకాఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి ఉపయోగపడే రన్‌వేలు మనదేశంలో అధికంగానే ఉన్నాయి. కానీ వాటిలో 150 మాత్రమే మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నాము. మిగతావన్నీ కూడా వృధాగా పడి ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ ప్రాంతీయ విమానయానాన్ని సులభతరం చేయాలన్నది LAT ఏరోస్పేస్ నిర్వాహకుల ఆలోచన.
LAT ఏరోస్పేస్ చిన్న విమానాలను అందుబాటులోకి తీసుకొస్తే అది కూడా సరసమైన ధరలకే ప్రజలకు అందిస్తే భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయం. అంతేకాదు ప్రజలు కూడా చాలా తక్కువ సమయంలోనే అనుకున్న లక్ష్యాలకు గమ్యస్థానాలకు చేరుకుంటారు.