Nandi Awards:తెలుగు చిత్ర పరిశ్రమలో నంది అవార్డులకి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ, టీవీ రంగంలో విశేష సేవలు అందించి, అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచిన నటీనటులకు ,సాంకేతిక నిపుణులకు, చిత్ర బృందాలకు ఈ అవార్డులను అందిస్తూ ఉంటారు. ఎప్పుడో గత దశాబ్ద కాలం క్రితమే నంది అవార్డుల ప్రధానోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ కళాకారులను గుర్తించి, నంది అవార్డులను అందించడానికి శుభవార్త ప్రకటిస్తూ.. దరఖాస్తుల కోరింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్ సినీ, టీవీ రంగానికి శుభవార్త చెప్పడంతో సెలబ్రిటీలు తెగ సంబరపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ రంగానికి సంబంధించి 2025 సంవత్సరానికి గానూ పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది.. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ కళాకారులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి, అవార్డులు అందించేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఒక ప్రకటన విడుదల చేసింది.
also read:నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!
తెలుగు భాషలో దేశంలో ఎక్కడైనా సరే నిర్మించిన చిత్రాలు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఉత్తమ చిత్రాలతో పాటు బాలల, జాతీయ సమైక్యత , డాక్యుమెంటరీ, విద్యాసంబంధ చిత్రాలకు కూడా ప్రత్యేక విభాగాలలో అవార్డులను అందించనున్నారు. ఇప్పటికే చలనచిత్రాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా 2025 సంవత్సరానికి గాను పురస్కారాలు ప్రకటించనున్నారు. టీవీ చిత్రాలతో పాటు టీవీ సీరియల్స్, టీవీ ఫీచర్స్, టెలిఫిలిమ్స్ తదితర విభాగాలలో అవార్డులు ఇవ్వనున్నారు. అంతేకాదు బాలల కోసం రూపొందించిన టీవీ చిత్రాలు, డాక్యుమెంటరీలు , సామాజిక అంశాలపై రూపొందించిన కార్యక్రమాలకు కూడా ఈ పురస్కారాలను అందించనున్నారు. ఇక ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో అక్టోబర్ 20 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేవారు అక్టోబర్ 25వ తేదీలోపు తమ దరఖాస్తులను విజయవాడలోని ఏపీ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలని ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ కోరారు. చలనచిత్ర, టెలివిజన్ రంగాలలో 2025లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, నిర్మాతలు, సంబంధిత సంస్థలు , సాంకేతిక నిపుణులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.