Nirupam Paritala:’కార్తీకదీపం’ సీరియల్ తో డాక్టర్ బాబుగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు నిరుపమ్ పరిటాల (Nirupam Paritala) . ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఒక్క సీరియల్ తోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ‘కార్తీకదీపం 2’ సీరియల్ తో కూడా మరింత క్రేజ్ దక్కించుకున్నారు. అంతేకాదు ఇటీవలే తన భార్య మంజుల (Manjula) తో కలిసి బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు.. అభిమానుల ఆశీస్సులు కావాలి అని తాజాగా సోషల్ మీడియా వేదికగా కోరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిరుపమ్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే నిరుపమ్ తండ్రి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
నిరుపమ్ తండ్రి ఓంకార్ పరిటాల బ్యాక్ గ్రౌండ్ ఇదే..
నిరుపమ్ తండ్రి ఎవరో కాదు ఓంకార్ పరిటాల (Omkar Paritala) ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టరు కానీ ఆయన ముఖం చూస్తే మాత్రం హో ఈయనేనా అంటూ గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా నేటితరం యువతకు ఈయన గురించి పెద్దగా తెలియకపోయినా.. 90స్ కిడ్స్ కి మాత్రం ఈయన బాగా సుపరిచితుడు అని చెప్పవచ్చు. రైటర్, డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా సినిమాలు, సీరియల్స్ కూడా చేశారు. సినీ కెరియర్లో 30కి పైగా సినిమాలు చేసిన ఈయన.. 50 వరకు సీరియల్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.
ఓంకార్ పరిటాల నటించిన చిత్రాలు..
జగపతిబాబు (Jagapathi babu) హీరోగా నటించిన ‘పందిరి మంచం’ అనే సినిమాతో డైరెక్టర్ గా మారారు ఓంకార్ పరిటాల. ఆ తర్వాత అన్న తమ్ముడు, పోలీస్ భార్య వంటి చిత్రాలతో పాటు దాదాపు 20కి పైగా సినిమాలకు కథ అలాగే డైలాగ్స్ కూడా అందించారు. ఇక పోలీస్ భార్యతో పాటు మరికొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు ఓంకార్ పరిటాల.
ఓంకార పరిటాల నటించిన సీరియల్స్..
సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించారు. నిన్నే పెళ్ళాడుతా, పవిత్ర బృందం, అలౌకిక, ఇది కథ కాదు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు ఇలా దాదాపు 50కి పైగా సీరియల్స్ లో నటించారు. తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. సుమారు 47 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు.
తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన నిరుపమ్..
నిరుపమ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. మా నాన్న చెన్నైలో వరుస సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేవారు. కానీ నా కోసం హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అనుకునే సమయంలోనే ఆయన గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో మేము ఒంటరి వాళ్ళయ్యాము. ఏం చేయాలో దిక్కుతోచలేదు. తండ్రి లేని జీవితం ఒక నరకప్రాయం. ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
ALSO READ:Sree Leela: అనారోగ్య సమస్యతో శ్రీలీల.. ట్రోలర్స్ పై డైరెక్టర్ మండిపాటు!
.