Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల వద్దకు చేరడంతో అసలు ఏం జరగబోతోందన్న ఆసక్తి పెరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు, బహిరంగ విమర్శలు హైకమాండ్ దృష్టికి వెళ్లాయి. దీంతో పార్టీ క్రమశిక్షణపై కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. సమస్యను వ్యక్తిగత వివాదంగా చూస్తారా.. లేక పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా పరిగణిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. కొండా సురేఖ వ్యవహారంపై హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అటు అదుపు తప్పి మాట్లాడితే ఎంతవారలైనా చర్యలు తప్పవనే సంకేతం ఇస్తూనే.. ఇటు క్రమశిక్షణ విషయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనే సంకేతం టీ కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ వేదికలపై అభిప్రాయాలు చెప్పడం ఒకటైతే.. బహిరంగంగా పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం మరోటన్న సందేశాన్ని అధిష్ఠానం ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. మరి కొండా సురేఖ విషయంలో ఖర్గే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు కొత్త గీత గీయబోతున్నారా?