Weirdest People In The World: ప్రపంచ వ్యాప్తంగా వింత జంతులు, వింత ప్రదేశాల మాదిరిగానే వింత మనుషులు కూడా ఉంటారు. వాళ్లు చేసే పనులు కూడా చాలా వింతగా ఉంటాయి. వారిలా మరొకరు ఉండటం అనేది సాధ్యం కాదు. అసాధారణ సామర్థ్యాలు, ప్రత్యేక లక్షణాలు, అద్భుతమైన పనులు చేసే వింత మనుషులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రపంచంలో అరుదైన వ్యక్తులు
⦿ కాట్సూమీ తమకేషి (జపాన్): ఈ వ్యక్తి రెండు చేతులు, రెండు కాళ్లతో కలిపి చింపాంజీలా పరిగెత్తగలడు. కాళ్లు, చేతులతో కలిపి అత్యంత వేగంగా, అంటే జస్ట్ 14 సెకెన్లలో 100 మీటర్ల దూరం పరిగెత్తగలడు. ఇది చింపాంజీ కంటే వేగవంతమైన పరుగు. అతడు తరచుగా జంతువులతో పరుగు పందెంలో పోటీ పడుతాడు. ఆయనలా పరిగెత్తడం సాధారణ మనుషులకు సాధ్యం అయ్యే పని కాదు.
⦿ జాన్ ఇవాన్స్ (లండన్): జాన్ ఇవాన్స్ అనే వ్యక్తి 54 ఏళ్ల వయసులో ఏకంగా ఒక కారును తన తల మీద ఎత్తుకొని నడిచే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. సాధారణంగా కారును కదిలించడానికి నలుగురు వ్యక్తులు అవసరమవుతారు. కానీ, ఇవాన్స్ ఈ విన్యాసాన్ని ఎటువంటి సహాయం లేకుండా చేస్తాడు. తల మీద కారును పెట్టుకుని రెండు చేతులను కిందికి వదిలేసి ఈజీగా ముందుకు నడుస్తాడు.
⦿ లుసిల్లే రాండన్ (ఫ్రాన్స్): ఈమె ప్రపంచంలోని అత్యంత వృద్ధులలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. 118 ఏళ్ల వయసులో 2023లో చనిపోయింది. ఆమె తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. చంద్రుడి మీద మనిషి అడుగు పెట్టిన సమయాన్ని, డిజిటల్ యుగాన్ని చూసింది. ఆమె జీవన శైలి, దీర్ఘాయుష్షు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
⦿ యసూకో తమాకీ (జపాన్): ఈమె 91 ఏళ్ల వయసులోనూ ఆఫీస్ మేనేజర్ గా పని చేశారు. పుట్టిన రోజు తప్ప ఏనాడు సెలవు తీసుకోని యసూకో, ప్రపంచంలోనే అత్యంత సీనియర్ ఆఫీస్ మేనేజర్ గా పేరు పొందారు. ఆమె అంకితభావం, చురుకుదనం అందరినీ ఆకర్షించారు.
⦿ కియరా కౌర్: ఐదేళ్ల చిన్నారి కియరా తక్కువ సమయంలో అత్యధిక పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమె అసాధారణ మేధస్సు, చదివే సామర్థ్యం ఆమెను వింత మనిషిగా నిలిపాయి.
Read Also: స్కూటీ కాస్ట్ లక్ష, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కాస్ట్ 14 లక్షలు!
ఇతరులతో పోల్చితే, వీరిలోని అసాధారణ లక్షణాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేశాయి. వీళ్లు చేసే పనులు కూడా చిత్ర విచిత్రంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అరుదైన వ్యక్తులుగా పేరు సంపాదించారు.