Visakha: ఏపీలో ఘోరం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళపై రోడ్డు పక్కనున్న ఓ చెట్టు విరిగి పడింది. స్పాట్‌లో ఆ మహిళ మృతి చెందింది. అదే సమయంలో వెళ్తున్న పలువురు ఆ ఘటన నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం విశాఖ సిటీ నడిబొడ్డున చోటు చేసుకుంది. డీటేల్స్‌లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
కొద్దిరోజులుగా వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. విశాఖలో అదే విధంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో విషాదం నెలకొంది. సితార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 38 ఏళ్ల పూర్ణిమ, తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది.
రోడ్డుపై ఆమె వెళ్తున్న సమయంలో చెట్టు విరిగి ఆమె మీద పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో రోడ్డుపై ట్రాక్టర్, నాలుగైదు టూవీలర్స్ వెళ్తున్నాయి. ఈ ఘటనలో ఓ కారు, బైక్ సహా ఇతర వాహనాలు డ్యామేజ్ అయ్యింది.
వైరల్‌గా మారిన వీడియో
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆపై సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఘటన జరగడానికి ఓ ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆయా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ: ఎవడ్రా రూల్ పెట్టింది? బస్సులో కళ్లు బాటిళ్లు, నడిరోడ్డుపై మహిళ హల్ఛల్
రోడ్ల పక్కన చెట్టు పెంచడం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు స్థానికులు. కనీసం కార్పొరేషన్ అధికారులు చెట్ల కొమ్మలను తొలగించిన సందర్భం లేదని అంటున్నారు. గడిచిన రెండు రోజులుగా వర్షాలతోపాటు ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయని అంటున్నారు. ముందుగా అధికారులు చెట్లపై దృష్టి పెడితే ఆ మహిళ బతికేది అంటున్నారు.
విశాఖలో విషాదం..
సీతమ్మధారలో స్కూటీపై వెళ్తున్న మహిళపై విరిగిపడిన చెట్టు
అక్కడికక్కడే మహిళ మృతి
భారీ వృక్షం కూలడంతో పలు వాహనాలు ధ్వంసం pic.twitter.com/ycAOgU8WEq
— BIG TV Breaking News (@bigtvtelugu) May 5, 2025