Amazon Delivery After 2 Years| ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కానీ కొన్నింటి గురించి మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటిదే ఒక వింత అమెజాన్ ఈ కామర్స్ సంస్థ చేసింది. ఏ వస్తువైనా సరే వేగంగా డెలివరీ చేస్తామని.. ఇంటి ముంగిట వరకు తెచ్చిస్తామని ఈ కామర్స్ కంపెనీలు గొప్పలు చెప్పుకుంటుంటాయి. అమెజాన్ ఈ కామర్స్ సంస్థ కూడా చాలా సార్లు అత్యంత వేగంగా ఆర్డర్ డెలివరి చేసినందుకు వార్తల్లో నిలిచింది. కానీ తాజాగా ఒక వింత జరిగింది. అమెజాన్ డెలివరీ వాళ్లు ఆర్డర్ ని రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేశారు. ఇది నిజంగానే జరిగింది. పైగా ఆ ఆర్డర్ చేసిన వ్యక్తి.. అది ఇక రాదని విసుగు చెంది ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. దాంతో పాటు అతనికి కంపెనీ రీఫండ్ కూడా చేసింది.
వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం జే అనే ట్విట్టర్ ఎక్స్ యూజర్ తన అకౌంట్ లో ఒక విచిత్ర పోస్ట్ చేశాడు. అతను రెండేళ్ల క్రితం ఒక ప్రెషర్ కుకర్ ని ఆర్డర్ చేస్తే.. అది రెండేళ్ల తరువాత ఇప్పుడు డెలివరీ జరిగిందని తన పోస్ట్ లో రాశాడు. అయితే విషయం అంత సింపుల్ గా లేదు. జే రెండేళ్ల క్రితం ఆర్డర్ రాకపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేశానని దాని గురించి కంపెనీ రీఫండ్ కూడా ఇచ్చేసిందని తెలిపాడు. ఇది చాలా స్పెషల్ కుక్కర్ అని.. తన ఇంట్లో వంటమనిషి ఈ కుకర్ డెలివరీ తరువాత చాలా సంతోషంగా ఉందని జే సరదాగా రాశాడు.
తన పోస్ట్ లో జే అనే యూజర్.. అతను అక్టోబర్ 1,2022 న ఆర్డర్ చేశానని.. అయితే అది ఇప్పుడు ఆగస్ట్ 28, 2024న డెలివరీ అయినట్లు అమెజాన్ యాప్ లో చూపిస్తున్న స్క్రీన్ షాట్లు కూడా పోస్ట్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్లకు ”నా ఆర్డర్ రెండేళ్ల తరువాత డెలివరీ చేసినందుకు థ్యాంక్యూ అమెజాన్ ” అని కాప్షన్ పెట్టాడు. జే చేసిన పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
అయితే ఈ విషయంపై అమెజాన్ కంపెనీ స్పందించింది. తన సమస్యను కస్టమర్ సర్వీస్ కు రిపోర్ట్ చేయాలని సూచించింది. కానీ అమెజాన్ కంపెనీకి సమాధానమిస్తూ.. ఏ సమస్య గురించి చెప్పాలి. ”నా కుకర్ నాకు చేరినందుకా?.. లేక నాకు ఫ్రీగా కుకర్ వచ్చినందుకా?” అని ఫన్నీగా స్పందించాడు.
Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ
ట్విట్టర్ ఎక్స్ లో జే పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది నెటిజెన్లు ఆ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ అయితే.. ససఇది చాలా ప్రత్యేకమైన ఆర్డర్ మంగళ గ్రహం నుంచి బహుశా బయలుదేరి ఇప్పుడు చేరిందేమో?”.. అని రాస్తే.. నితేశ్ పసారి అనే మరొక యూజర్ తనకు కూడా ఇలాగే జరిగిందని.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన తరువాత నెల రోజులకు డెలివరీ అయిందని రాశాడు.
ఇంకొక యూజర్.. ”ఇది చాలా స్పెషల్ ఆర్డర్ అయి ఉంటుంది. ప్రత్యేకంగా అలూమినియం తీసి దీన్ని తయారు చేసినందుకు ఇంత సమయం పట్టి ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యంగా డెలివరి జరిగినట్లు ఉంది”, అని రాశాడు.