Cheating Affair Gift China| ఇటీవలి కాలంలో కోర్టులు కూడా కళ్లు తెరుచుకుంటున్నాయి. కొందరు మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని గుర్తిస్తున్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి పనులు చేయాలని అనుకున్న ఆడవాళ్లకు గట్టి షాకులు కూడా ఇస్తున్నాయి. తాజాగా చైనాలోని షాంఘైలో ఉన్న ఒక కోర్టు ఇదే పనిచేసింది. ఒక యువతి.. తన మాజీ ప్రియుడికి ఇచ్చిన 3.2 కోట్ల రూపాయలు తిరిగివ్వాల్సిన పనిలేదని తీర్పిచ్చింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు పోవడంతో ఆమె ఖంగుతింది.
ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. ‘లి’ అనే వ్యక్తి 2018లో ‘షూ’ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. అయితే లితో ప్రేమలో ఉన్నట్లు నటించిన షూ.. అతని మేనల్లుడితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇలా ఇద్దరి ఫీలింగ్స్‌తో ఆడుకోవాలని చూసింది. ఈ విషయం తెలిసిన లి మండిపోయాడు. షూను కలిసి నోటికొచ్చినట్లు తిట్టేశాడు. తనను మోసం చేసినందుకు నిందించి, అక్కడితో ఆ బంధం తెంపేయాలని అనుకున్నాడు. కానీ షూకు అలా చెయ్యాలని లేదు. అందుకే లిని బతిమిలాడుకుంది. కాళ్లావేళ్లా పడింది. అయినా లిలో మార్పు రాలేదు. దాంతో తన తప్పుని ఒప్పుకున్న ఆమె.. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని క్షమాపణ చెప్తూ ఒక లేఖ రాసింది.
Also Read: బుర్కా ధరించకపోతే విడాకులు.. అలా కుదరదన్న హై కోర్టు
‘నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకర్థమైంది. నేను చాలాసార్లు నిన్ను చీట్ చేసిన మాట నిజమే. ఇది నీకు చాలా బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. ఇప్పుడే నాకు నా తప్పు తెలిసొచ్చింది. ఈ తప్పులన్నీ సరిచేసుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే నా నిజాయితీతో నీ రుణం తీర్చుకుంటాను’ అంటూ లేఖ రాసింది. అతనికి ఆ లేఖ అందిన తర్వాతి రెండ్రోజుల్లో అప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం చొప్పున మొత్తం 3 లక్షల చైనీస్ యువాన్లు (సుమారు రూ.3.2 కోట్లు) డబ్బులు కూడా అతని ఖాతాకు పంపించింది. ఆమె అంతలా చెప్పడంతో ఇకనైనా మారుతుందని అనుకున్న లి.. ఆమెను క్షమించాడు.
అయితే 2022లో మరోసారి లికి షాక్ తగిలింది. తన మేనల్లుడితో షూ అక్రమ సంబంధం కొనసాగిస్తూనే వస్తోందని, తనను ఇలా మోసం చేసిందని అతనికి తెలిసొచ్చింది. దాంతో కోపంతో ఊగిపోయిన అతను.. షూతో కలిసి జీవించడం కుదరదని తేల్చి చెప్పి, ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. అప్పుడే షూ అతనికి ఇంకో షాకిచ్చింది. బ్రేకప్ చెప్పాడు కాబట్టి.. తానిచ్చిన 3.2 కోట్ల రూపాయలు తిరిగిచ్చేయాలని, తనను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే తను ఆ డబ్బు ఇచ్చానని వాదించింది.
తనను ఇంతలా మోసం చేసిన అమ్మాయికి అంత డబ్బు తిరిగివ్వడం లికి అస్సలు ఇష్టం లేదు. అందుకే అతను కోర్టుకెక్కాడు. తనకు ఇచ్చిన డబ్బు పెళ్లి చేసుకోవడం కాదని.. ఇంతకాలం ఆమె తనను మోసం చేసినందుకు, మానసికంగా టార్చర్ పెట్టినందుకు క్షమాపణ కోరుతూ తనకు తానే ఇచ్చిన నష్టపరిహారం అని లి వాదించాడు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. లి వాదనలో నిజం ఉందని నమ్మింది. షూ రాసిన క్షమాపణ లేఖ కూడా కోర్టుకు చూపించాడు లి. ఆమె ఇచ్చిన డబ్బు నష్టపరిహారమే అని తేల్చి, వాటిని రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పుచ్చింది. దీంతో ఖంగుతినడం షూ వంతైంది. ఈ తీర్పు విన్న నెటిజన్లు.. కోర్టు తీర్పును తెగ మెచ్చుకుంటున్నారు. మెంటల్‌గా అంత టార్చర్ పెట్టిన ఆమె కచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఇండియాలో ఇలా ఎప్పుడుస్తుందోనని చమత్కరిస్తున్నారు.