ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర ప్రభావితం అయ్యాయి. పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు పలువురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక అటోర్ వాహనాలతో వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టింది. పంజాబ్ లోని వరద బాధిత గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి భారత సైన్యం కొత్తగా ప్రవేశపెట్టిన ATOR N1200 వాహనాలను ఉపయోగిస్తోంది. భారీ వర్షాలు ముంచెత్తడంతో లోతైన నీటి ప్రవాహం, కఠినమైన భూభాగం గుండా వెళ్ళడానికి రూపొందించబడిన ఈ వాహనాలు అమృత్ సర్ లో సహాయక చర్యలు చేపట్టాయి.
ఏంటీ ATOR N1200 వాహనాల ప్రత్యేకతలు
ATOR N1200 UK-ఆధారిత కోపాటో కంపెనీ భాగస్వామ్యంతో JSW గెక్కో మోటార్స్ వీటిని తయారు చేసింది. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిన రూపొందించింది. ఇందులో ATOR N1200, SHERP N1200 అనే రెండు రకాల వాహనాలను రూపొందించింది. ఇవి కఠినమైన భూభాగంతో పాటు నీటిలోనూ సులభంగా నడుస్తాయి. ఈ వాహనాలను అడవులు, చిత్తడి నేలలు, మంచు ప్రాంతాలు, ఎడారులు, నదులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు, సరిహద్దు గస్తీ, విపత్తు రక్షణ కార్యకలాపాల కోసం రూపొందించారు. రక్షణ మంత్రిత్వ శాఖ 2024లో 96 వాహనాలకు రూ.250 కోట్లతో ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం వీటిని చండీగఢ్ లో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాన్ని పంజాబ్ వరద సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు.
గంటకు 6 కి.మీ వేగంతో ప్రయాణం
ATOR N1200 వాహనం నీటిలో, భూమిపై సమర్థవంతంగా పనిచేస్తుంది. నీటిలో 6 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. భూమిపై గంటకు 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 70 సెం.మీ ఎత్తు వరకు అడ్డంకులను అధిగమించగలదు. 35 డిగ్రీల వరకు ఏటవాలు ఉన్న భూభాగాలలోనూ సేవలు అందిస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. 44.3 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం సుమారు 2,800 కిలోల బరువు ఉంటుంది. 1,000 కిలోల లోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన అల్ట్రా-లో ప్రెజర్ టైర్లు ఉంటాయి. ఇవి భూభాగాలలో ట్రాక్షన్‌ను అందిస్తాయి. ఆటోమేటిక్ ఇన్ ఫ్లేషన్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటాయి. ఈ వాహనాలు అన్ని వాతావరణ పరిస్థితులలో పని చేస్తాయి. -30°C చలి నుంచి +45°C వేడి వరకు పని చేస్తాయి ATOR N1200 వాహనాలను సరిహద్దు గస్తీ, రవాణా, లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం ఉపయోగించబడుతుంది, ముఖ్యంగా లడఖ్ లాంటి ఎత్తు గల ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తుంది. అగ్నిమాపక, అటవీ సంరక్షణ, గనుల వంటి రంగాలలో కూడా ఉపయోగించబడుతుంది. ఒక్కో యూనిట్ ధర సుమారు రూ. 50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుంది. ఈ వాహనంలో ఉపయోగించే భాగాలలో 70% కంటే ఎక్కువ స్వదేశీయంగా తయారు చేయబడ్డాయి.
Read Also: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?