Indian Railway Viral Video: భారతీయ రైల్వేలో నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తుంటారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరంగా గమస్య స్థానాలకు చేరుకుంటారు. ఇప్పుడిప్పుడే భారతీయ రైల్వే పూర్తిగా అప్ డేట్ అవుతోంది. అత్యాధునిక వందేభారత్ రైళ్లలు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. అయితే, ప్రయాణీకులు మాత్రం ఇప్పటికీ మారడం లేదు. అత్యాధునిక రైళ్లలోనూ ఊరమాస్ వ్యవహారాలు చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోను చూస్తూ, మీరూ నిజమే అంటారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా రెడిట్ లో ఓ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో ఓ ప్రయాణీకుడు ఏకంగా చైర్ కార్ రైలు లగేజ్ రాక్ లో పడుకుని కనిపించాడు. రైల్లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణీకుడు ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొద్ది క్షణాల్లోనే బాగా హల్ చల్ అయ్యింది. లగేజీ కంపార్ట్ మెంట్ లో హాయిగా పడుకుని చేతిలో ఫోన్ పట్టుకుని చూస్తున్నాడు. ఇతర ప్రయాణీకులు బ్యాగులను పక్కన ఉంచినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే, మరికొంత మంది నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న సదరు ప్రయాణీకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
సోషల్ మీడియాలో ఈ ఫోటో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. “నిజానికి మనిషి సామాను మోస్తాడు. కానీ, ఇక్కడ మనిషే సామాను అయ్యాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “అతడు ఎవరి సామాను అయినా కావచ్చు” అని మరో వ్యక్తి జోక్ చేశాడు. “సామాను పెట్టే ర్యాక్ లోకి ఎక్కి పడుకోవాలనే ఆలోచన వచ్చిన అతడు మామూలు వ్యక్తి కాదు. రేపటి తరానికి ఆదర్శం” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంతకీ అతడు అక్కడికి ఎలా ఎక్కాడు? ఎలా దిగబోతున్నాడు? అని మరో వ్యక్తి ప్రశ్నించాడు. “బహుశ ఈ ఫోటో ఏదో యూపీ, బీహార్ రైల్లో తీసి ఉండొచ్చు. అక్కడ ఏదైనా సాధ్యమే సుమా” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఉత్తరాది రాష్ట్రాల్లో రైళ్లు కిక్కిరిసిపోతాయి. కనీసం అతడికి అక్కడైనా ప్లేస్ దొరికింది. మరకొంత మందికి అసలు రైలు ఎక్కే వశం కాదు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “అత్యంత తెలివైన వ్యక్తులు మాత్రమే ఇలాంటి అరుదైన ఫీట్లు చేస్తుంటారు. సామాన్యులకు ఇలాంటి పనులు సాధ్యం కాదు” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు.
మొత్తంగా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే సమయంలో సామాను పెట్టుకునే ప్రదేశంలో పడుకున్నా, రైల్లో టీటీఈ ఏం చేస్తున్నాడంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రీమియం రైళ్లను కూడా షేరింగ్ ఆటోగా మార్చుతారని కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే ఈ ఘటనపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
Read Also: ప్యాసింజర్లతో పోల్చితే క్యాబిన్ క్రూ సీట్ బెల్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకో తెలుసా?