Iphone In Temple Hundi| గుడిలో భక్తులు శ్రద్ధతో విరాళాలు ఇస్తుంటారు. తమ ఆరాధ్య దైవానికి శక్తి మేర కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి గుడి హుండీలో పొరపాటున తన కొత్త ఐఫోన్ పారేసుకున్నాడు. ఈ విషయం దేవాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఆ ఐఫోన్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరుపోరూర్ పట్టణంలో అరుళ్‌మిగు కందస్వామి (సుబ్రమణ్య స్వామి) దేవాలయం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. వినయగాపురం ప్రాంతానికి చెందిన దినేశ్ అనే యువకుడు నవంబర్ నెలలో కందస్వామి దేవాలయంలో దర్శనం కోసం వెళ్లాడు. అయితే గుడిలో హుండీలో దినేశ్ విరాళం వేసేందుకు తన జేబులో నుంచి డబ్బులు తీయబోయాడు. కానీ ఆ సమయంలో అతని చేతిలో ఉన్న యాపిల్ ఐఫోన్ పొరపాటున హుండీలో పడిపోయింది. ఆ హుండీకి తాళం వేసి ఉంది. దాని చుట్టు ఇనుప కడ్డీలతో ఆ హుండీ తెరవడానికి వీల్లేకుండా ఉండడంతో దినేశ్ ఆందోళన చెందాడు.
అక్కడ ఉన్న పూజారికి ఈ విషయం చెప్పగా.. ఆయన గుడి యజమాన్యం అధికారులను సంప్రదించాలని సూచించారు. దినేశ్ గుడి మేనేజ్ మెంట్ వారికి సంప్రదించగా.. ఆ ఫోన్ ఇక దినేశ్‌ది కాదని.. ఇప్పుడది దైవాధీనంలో ఉందని.. హుండీలో పడిన ప్రతి వస్తువు ఆ స్వామి వారికే చెందుతుందని బోధించారు. కానీ దినేళ్ ఆ ఫోన్ తనకు చాలా అవసరమని వాదించాడు. దీంతో వారు ఆ హుండీ కేవలం రెండు నెలలకు ఒకసారి మాత్రమే తెరవడం జరుగుతుందని.. ఆ రోజే రావాలని సూచించారు.
ఈ కారణంగా దినేశ్ స్థానిక హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. హుండీ తెరిచే సమయం తనకు ముందుగానే తెలియజేయాలని ఫిర్యాదులో కోరాడు.
Also Read: దేశంలో జోరుగా సాగుతున్న రహస్య బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్
ఈ క్రమంలో డిసెంబర్ 20, 2024 శుక్రవారం కందస్వామి టెంపుల్ మేనేజ్ మెంట్ ఆ హుండీని తెరిచారు. అదే సమయంలో దినేశ్ అక్కడికి చేరుకున్నాడు. కానీ అప్పుడు కూడా గుడి మేనేజ్ మెంట్ సభ్యులు అతని ఐఫోన్ ఇవ్వడానికి నిరాకరించారు. దినేశ్ తనకు ఆ ఫోన్ చాలా అవసరమని ప్రాధేయపడగా.. వారు ఫోన్ ఇవ్వడం కుదరదని.. కావాలంటే ఫోన్ లో నుంచి సిమ్ కార్డు, అతని డేటాని తీసుకోవచ్చని చెప్పారు.
కానీ అప్పటికే దినేశ్ కొత్త సిమ్ కొనుగోలు చేశాడు. దీంతో అతని పాత సిమ్ అవసరం లేదని చెప్పి నిరాశతో వెనుదిరిగాడు. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో.. కందస్వామి టెంపుల్ మేనేజ్ మెంట్ అధికారులు మాట్లాడుతూ.. “ భద్రత కోసం హుండీ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఉంది. ఆ యువకుడు గుడి హుండీలో ఐఫోన్ విరాళంగా ఇచ్చాడో.. పొరపాటున పారేసుకున్నాడో మాకు దానిపై స్పష్టత లేదు. ఒక వేళ విరాళంగా వేసి.. తరువాత అతను మనుసు మార్చుకొని ఉన్నా.. దాన్ని తిరిగి ఇచ్చే అధికారం మాకు లేదు.” అని తమ వాదన వినిపించారు.