Wifi Breakup| ఒక ప్రేమికుల జంట బ్రేక్ అప్ చేసుకున్న తీరు గురించి సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా జరుగుతోంది. ఆ బ్రేక్ అప్‌కు కారణం తెలిసి అందరూ షాకైపోతున్నారు. చివరికి ఒక మీడియా ఛానెల్ రంగంలోకి దిగి నిజాలు వెలికి తీసింది. ఆ ప్రేమికులిద్దరూ విడిపోవడానికి ఒక వైఫై కనెక్షన్ కారణం. ఈ ఘటన చైనా దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చైనా దేశంలోని చాంగ్‌కింగ్ పట్టణానికి చెందిన లెయి అనే యువతి ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం చేస్తోంది. ఆమె గత కొంతకాలంగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులుగా సినిమాలకు, షికార్లకు తిరిగారు. అయితే లెయిని తీసుకొని ఆమె బాయ్ ఫ్రెండ్ చాంగ్ కింగ్ పట్టణంలో హాలిడే కోసం ఒక హోటల్ కు వెళ్లాడు. అక్కడే ఒక షాకింగ్ ఘటన జరిగింది. హోటల్ కు వెళ్లగానే చెక్ ఇన్ కోసం గుర్తింపు కార్డు ధృవీకరణ కోసం అడిగారు. అయితే లెయి తన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు లాంటిది) ఇంటి వద్దనే మరిచిపోయింది. దీంతో ఆమె తన ఫోన్ లో నుంచి డిజిటల్ ఐడీ కార్డ్ ని చూపించాల్సి వచ్చింది. అందుకోసం ఆమె తన ఫోన్ చెక్ చేయగా అక్కడ నెట్ వర్క్ లేదు. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ నుంచి హాట్ స్పాట్ ఆన్ చేయమని అడిగింది. కానీ అతని ఫోన్ లోకూడా నెట్ వర్క్ చూపించడం లేదు. అప్పుడే వారికి హెటల్ వైఫ్ కనెక్షన్ చూపిస్తోంది. ఆ వై ఫైకి పాస్ వర్డ్ లేకపోవడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో కనెక్ట్ కాలేదు.
కానీ లెయి ఫోన్‌లో మాత్రం వైఫై క్లిక్ చేయగానే వెంటనే అది కనెక్ట్ అయిపోయింది. పాస్ వర్డ్ అడగలేదు. ఇది చూసి ఆమె బాయ్ ఫ్రెండ్ షాకైపోయాడు. పాస్ వర్డ్ లేకుండానే ఎలా కనెక్ట్ అవుతుందని ప్రశ్నించాడు. అంటే ఆమె ఆ హోటల్ కు ఇంతకుముందు వచ్చి ఉంటుందని అతను అనుమానం వ్యక్తం చేశాడు. కానీ లెయి మాత్రం అలాంటిదేమీ జరగలేదని లెయి ఎంత చెప్పినా అతను నమ్మలేదు. ఆ హెటల్ అందరూ ప్రేమికులే వస్తుంటారు. దీంతో ఆమెకు మరో యువకుడికి సంబంధం ఉందని ఆమె బాయ్ ఫ్రెండ్ ఆరోపించాడు. ఆమె క్యారెక్టర్ సరైనది కాదని నిందలు వేశాడు. ఆ హోటల్ వైఫై పాస్ వర్డ్ లేకుండానే ఎలా ఆమె ఫోన్ లో కనెక్ట్ అయిపోతుందని వాదించాడు. వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగాక. చివరకు లెయిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత లెయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె బాయ్ ఫ్రెండ్ సమాధానం ఇవ్వలేదు. ఆమెకు బ్రేక్ అప్ చెప్పేశాడు.
లెయి తన బ్రేక్ అప్ స్టోరీ గురించి తన ఫ్రెండ్స్ కు చెప్పింది. తన బాధన వారితో పంచుకుంది. వారంతా ఇది విని నమ్మలేకపోయారు. అయితే ఈ బ్రేక్ అప్ కు గల కారణం ఆ వైఫ్ కనెక్షన్ కావడంతో నిజమేంటో తెలుసుకోవడానికి లెయి పరిశీలించింది.
అసలు వైఫై రహస్యం అదే..
నిజానికి లెయి పనిచేస్తున్న ఆఫీసులో కూడా వైఫై కనెక్షన్ ఉంది. అక్కడ కూడా వైఫై కనెక్షన్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ రెండూ సేమ్ పేరుతో ఉంది. అందుకే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో హోటల్ కు వెళ్లినప్పుడు అదే యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. ఇదంతా తెలసుకొని లెయి.. మళ్లీ తన బాయ్ ఫ్రెండ్ ని కాల్ చేసింది. అతను ఫోన్ తీయకపోవడంతో జరిగినదంతా వివరిస్తూ మెసేజ్ చేసింది. కానీ అతన ఆమె నెంబర్ ను బ్లాక్ చేసేశాడు. లెయి స్నేహితులు ఆమె బ్రేక్ అప్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది విపరీతంగా వైరల్ అయింది.
దీంతో ఒక టీవి చానెల్ రిపోర్టర్ లెయిని సంప్రదించి ఆమె ఇంటర్‌వ్యూ తీసుకున్నాడు. ఆ తరువాత ఆమె చెప్పింది నిజమేనని ధృవీకరించడానికి ఆ టీవి రిపోర్టర్ రెండు ప్రదేశాల్లోని వైఫైని టెస్ట్ చేశాడు. అయితే ఆ ఇంటర్‌వ్యూలో లెయి ఇక తాను కూడా తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేశానని చెప్పింది. తనపై నమ్మకం లేని వాడితో జీవితం గడపడం తనకు కూడా ఇష్టం లేదని చెప్పింది.