Toothbrush In Stomach| చిన్నప్పుడు చాలామంది పిల్లలు తెలిసీ తెలియని వయసులో ఏవేవో తినేస్తుంటారు, మింగేస్తుంటారు. సబ్బు, నాణేలు, పిన్, లాంటి తినకూడని వస్తువులు కూడా తెలియక తినేస్తారు. ఆ తరువాత వారికి కడుపు నొప్పి లాంటివి రావడంతో కొంతకాలం తరువాత విషయం తెలుస్తుంది. డాక్టర్లు చికిత్స లేదా సర్జరీ చేసి వాటిని కడుపులో నుంచి తొలగిస్తారు. ఇలాంటి ఘటనలు అరుదుగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక 64 ఏళ్ల వ్యక్తి కడుపులో టూత్ బ్రష్ ఉందని డాక్టర్లు గుర్తించారు. మరో విచిత్ర మేమిటంటే .. ఆ బ్రష్ అతని కడుపులో 50 ఏళ్లకు పైగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని ఒక ఆసుపత్రిలో 64 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో వచ్చాడు. వైద్యులు పరీక్షలు చేస్తే.. అతని కడుపులో ప్రత్యేకంగా చిన్న పేగులో 17 సెంటీమీటర్ల టూత్‌బ్రష్ ఉన్నట్లు కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా, ఈ టూత్‌బ్రష్ అతని శరీరంలో 52 సంవత్సరాలుగా ఉంది!
ఆ వ్యక్తి పేరు యాంగ్. అతను 12 ఏళ్ల వయసులో టూత్‌బ్రష్‌ను మింగానని, కానీ భయం వల్ల తల్లిదండ్రులకు చెప్పలేదని తెలిపాడు. ఈ 52 సంవత్సరాలలో అతనికి ఎలాంటి సమస్యలు రాలేదు, అతను సాధారణ జీవితం గడిపాడు.టూత్‌బ్రష్ స్వతహాగానే కరిగిపోతుందని యాంగ్ భావించాడు. కానీ అయిదు దశాబ్దాల తరువాత అతడికి కడుపు నొప్పి వచ్చింది. దీంతో వైద్యులు యాంగ్‌కు ఎండోస్కోపిక్ సర్జరీ చేసి.. 80 నిమిషాల్లో టూత్‌బ్రష్‌ను తీసేశారు. గత మూడు సంవత్సరాలలో ఆసుపత్రిలో జీర్ణవ్యవస్థ నుంచి ఒక వస్తువును తొలగించడానికి ఇంత సమయం పట్టిన సందర్భం ఇదే మొదటిసారి అని వైద్యులు చెప్పారు.
వైద్య నిపుణుల ప్రకారం.. పేగుల్లో టూత్‌బ్రష్ వంటి వస్తువు కదిలితే, అది పేగు గోడలను గాయపరచవచ్చు. ఇది పేగు రంధ్రం (ఇంటెస్టినల్ పెర్ఫొరేషన్) కావచ్చు, అప్పుడది ప్రాణాంతకంగా మారుతుంది. కానీ, యాంగ్ విషయంలో టూత్‌బ్రష్ పేగులో ఒక మలుపులో చిక్కుకుని, దాదాపు 52 సంవత్సరాలు కదలలేదు. ఇది అతని అదృష్టం అని వైద్యులు వెల్లడించారు.
కడుపులో టూత్ బ్రష్ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ పోస్ట్ చూసి చాలామంది నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ అయితే.. “52 సంవత్సరాలు టూత్‌బ్రష్‌తో శరీరంలో ఎలాంటి హాని లేకుండా బతకడం అద్భుతం!” అని ఒకరు అన్నారు. “అలాంటి చిన్నప్పటి చిలిపి పనులు తల్లిదండ్రులకు తెలిస్తే, గట్టిగా తిట్టు పడేది!” అని మరొకరు వ్యాఖ్యానించారు.
గతంలోనూ ఇలాంటి సంఘటన
ఇలాంటి సంఘటన చైనాలో ఇదే మొదటిసారి కాదు. 2019లో.. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఆసుపత్రిలో లీకి అనే 51 ఏళ్ల వ్యక్తి.. కడుపు నొప్పితో చేరాడు. CT స్కాన్‌లో అతని డ్యూయోడినమ్‌లో 14 సెంటీమీటర్ల టూత్‌బ్రష్ కనిపించింది. దీని కారణం లీ వివరించాడు. 20 సంవత్సరాల క్రితం ఆత్మహత్య ప్రయత్నంలో ఆ టూత్‌బ్రష్‌ను మింగాడు. అతనికి HIV ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు.. బాధతో ఆ పని చేశారు.
Also Read: భయం లేకుండా పార్టీ ఎంజాయ్ చేయండి.. ఈ టిప్స్ పాటిస్తే నో హ్యాంగోవర్
ఈ సంఘటనలు మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. ఏదైనా వస్తువును మింగినట్లయితే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అది కరిగిపోతుందని ఊహించకూడదు. కడుపు నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. యాంగ్ అదృష్టవశాత్తూ 52 సంవత్సరాల పాటు సమస్య లేకుండా బతికాడు, కానీ అందరికీ అలాంటి అదృష్టం ఉండకపోవచ్చు.