Mobile Ceremony Vehicles: ఆ నలుగురు.. ఎప్పుడు అవసరం. శరీరం నుండి ప్రాణం వేరయ్యాక ఆ నలుగురు తప్పక అవసరం. బంధువులు, స్నేహితులు, స్థానికులు ఇలా ఎవరో ఒకరు.. ఆ నలుగురి రూపంలో వచ్చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితపు చివరి మజిలీలో ఇలా వారు రావాల్సిందే. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసింది. ఆ నలుగురు లేరు.. ఆ ఏడుపులు లేవు.. ఇంటి వద్దకే పాలన అన్నట్లుగా.. ఇంటి వద్దే దహన సంస్కారాలు నిర్వహించే రోజులు వచ్చేశాయ్. ఇంతకు అసలు విషయం ఏమిటంటే..
నిన్నటి వరకు ఇదీ పరిస్థితి!
ఒక ఇంట్లో ఎవరైనా మృతి చెందితే, దహన సంస్కారాలు ఒక కార్యంగా భావిస్తారు. మన సాంప్రదాయం ప్రకారం ఎన్నో పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఎవరి మతానికి సంబంధించిన పద్ధతులు వారు పాటిస్తారు. వ్యక్తి మరణిస్తే, ఆ ఇంట్లో ఏడుపులు, బంధువుల రాకలు, అలాగే శవయాత్ర ఇలా దృశ్యాలు మన కంట కనిపిస్తాయి.
శవయాత్రలో ఆ నలుగురు!
వ్యక్తి మరణిస్తే ఆ నలుగురు శ్మశానవాటిక వరకు పాడే మోయాల్సిందే. అంతేకాదు వచ్చిన బంధుగణం అక్కడి వరకు వెంట వచ్చి చివరగా దహన సంస్కారాలు పూర్తయ్యేవరకు అక్కడే ఉండి వీడ్కోలు పలుకుతారు. ఇదొక పవిత్ర ఘట్టంగా సాగుతుంది.
ట్రెండ్ మారింది.. ఇప్పుడంతా ఇంటి వద్దనే!
ఇప్పుడు బిజిబిజీ బ్రతుకులు. అక్కడక్కడా ఆ నలుగురు కూడా రాలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకేనేమో ఓ కొత్త ట్రెండ్ దహన సంస్కారాల నిమిత్తం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రెండ్ కు ఆ నలుగురి అవసరం లేనే లేదు. అంతేకాదు పెద్దగా బంధుగణం కూడా అవసరం లేదు. జస్ట్ ఇలా వచ్చేస్తారు.. అలా దహన సంస్కారాలు పూర్తి చేసి ఇలా వెళ్లిపోతారు.
ఏంటి కొత్త ట్రెండ్?
ఈ కొత్త ట్రెండ్ ఏమిటంటే.. మొబైల్ సెర్మనీ వాహనాలు వచ్చేశాయి. ఇక మృతదేహాన్ని శ్మశానవాటిక వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటి వద్దనే అంతా పూర్తి చేస్తారు. వాహనం ఇంటి వద్దకే వస్తుంది. డెడ్ బాడీని వాహనంలో గల యంత్రంలోకి పంపిస్తారు. మృతుడి కుటుంబానికి చెందిన వ్యక్తి బటన్ నొక్కేస్తారు. సాధారణంగా తలకొరివి పెట్టే బదులు.. ఇక్కడ బటన్ నొక్కేస్తారు. వెంటనే బూడిదను కూడా ఆ వాహనంలో వచ్చిన వ్యక్తులు అందజేస్తారు. ఇదన్నమాట కొత్త ట్రెండ్.
ఇది తప్పదా?
ఈ తరహా ట్రెండ్ రావడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. చివరి మజిలీలో కూడా ఆధునికత అవసరమా అనేస్తున్నారు. బంధుగణం అంతా వెంట రాగా, పద్ధతిగా స్మశానవాటికలో జరిగే ప్రక్రియ.. ఇలా పూర్తి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మానవతా బంధాలు తెగిపోయేలా ఈ కొత్త ట్రెండ్ ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం.. అనాధ శవాలకు, ఇతర కారణాల రీత్యా చనిపోయిన వారికి ఇదొక మంచి కార్యమే అనేస్తున్నారు. ఏది ఏమైనా రాను రాను ఇకపై శవయాత్రలు కనిపించని రోజులు రానున్నాయని చెప్పవచ్చు.
నెక్ట్స్ జనరేషన్ అంత్య క్రియలు… చచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలను కూడా అప్డేట్ చేస్తున్నారు 🙆♀️ pic.twitter.com/LnOY6HBeyz
— Megha (@MovieloverMegha) July 18, 2025