ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కొంత మంది సోషల్ మీడియాలో మరీ యాక్టివ్ గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి మూవ్ మెంట్ క్యాప్చర్ చేస్తూ నెట్టింట్లో పోస్ట్ చేస్తారు. లైకులు, షేర్లు, కామెంట్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతారు. ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొంత మంది సోషల్ మీడియా రీల్స్ కోసం డేంజరస్ స్టంట్లు చేస్తారు. ముఖ్యంగా రైళ్లలో, రైలు పట్టాల మీద, లోయ అంచులలో, జలపాతాల దగ్గర రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంత మంది యువతులు కూడా రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా కొంత మంది యువకులు రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీస్ వాహనాన్నే కొట్టేశారు. ఈ ఘటన రాష్ట్రంలో అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
రీల్స్ కోసం పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాళ్లు
లైకుల కోసమో, ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనో చాలా మంది చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తూ పోస్టు చేస్తుంటారు. కొంత మంది ఎక్కడ, ఎలా రీల్స్ చేయాలో తెలియకుండా పవర్తిస్తుంటారు. ఫలితంగా చాలా మంది చిక్కుల్లో పడతారు. తాజాగా కొంత మంది యువకులు రీల్స్ కోసం ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో జరిగింది. పోలీస్ వాహనంతో ఇన్ స్టాగ్రామ్ రీల్ వీడియో తీసి చిక్కుల్లో పడ్డారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అమ్రాబాద్ మండలానికి చెందిన ఎస్సై బంధువులు ఇన్ స్టా రీల్స్ చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే స్టేషన్ నుంచి పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఆ వాహనంలో ఈగలపెంటకు వెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతంలో లో ఆపారు. పోలీస్ వాహనంతో రకరకాల రీల్స్ చేశారు. వాటిలో కొన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ యువకుల వెర్రివేషాలు కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి. నెమ్మదిగా ఈ రీల్స్ వ్యవహారం పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేసిన యువకులు ఎస్సై బంధువులగా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ వాహనాన్ని మిస్ యూజ్ చేసిన యువకులపై, పోలీస్ వాహనాన్ని మిస్ యూజ్ చేసేందుకు కారణం అయిన ఎస్సై పైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు దర్యాప్తు నివేదిక అందనుంది. అనంతరం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రీల్స్ చేసిన యుకులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనాన్ని ఎప్పుడు? ఎక్కడి నుంచి? ఎలా తీసుకున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. గత బీఆర్ఎస ప్రభుత్వ హయాంలో అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ మనువడు కూడా పోలీస్ వాహనం మీద కూర్చొని రీల్స్ చేయడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది.
Read Also: రీల్ కోసం యువకుడి డేంజర్ స్టంట్.. పట్టుకొని వీపు విమానం మోత మోగించిన పోలీసులు!